Almonds | బాదంపప్పులను తినడం వల్ల ఎన్ని అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ పప్పులను రోజూ నానబెట్టి తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. మనం బాదం పప్పులను తరచూ స్వీట్లలో తింటుంటాం. అనేక రకాల తీపి వంటకాలను లేదా మసాలా వంటకాలను తయారు చేయడంలోనూ బాదం పప్పును ఉపయోగిస్తుంటాం. బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బాదం పప్పులను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. క్యాన్సర్ ముప్పు నుంచి మనల్ని ఇవి రక్షిస్తాయి. అందువల్ల తరచూ బాదంపప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
అయితే బాదంపప్పులు ఆరోగ్యకరమే అయినప్పటికీ వీటిని ఎంత తినాలో అంతే తినాలి. మోతాదుకు మించి తింటే అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయి. ముఖ్యంగా బాదంపప్పును అధికంగా తినడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల బాదంపప్పును తినే విషయంలో జాగ్రత్తలను పాటించాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ స్టోన్లు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పప్పును తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు అంటున్నారు. బాదంపప్పులలో ఆగ్జలేట్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని క్యాల్షియంతో కలిసి కిడ్నీ స్టోన్స్ వచ్చేలా చేస్తాయి. అందువల్ల బాదంపప్పును మోతాదులోనే తినాలి. అధికంగా తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మన శరీరంలో అధికంగా చేరే ఆగ్జలేట్స్ను బయటకు పంపించలేవు. దీంతో కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడుతాయి.
బాదంపప్పును మోతాదులో తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు. రోజుకు 7 నుంచి 8 బాదంపప్పులు సరిపోతాయని వారు అంటున్నారు. ఇంతకు మించి తినొద్దని వారు అంటున్నారు. ఇక కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని అసలు తినకూడదని, డాక్టర్ సలహా మేరకు తినాలని సూచిస్తున్నారు. ఇక కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు సోయా ఉత్పత్తులు, చాక్లెట్, ఓట్స్, రాజ్మా, బీట్ రూట్, పాలకూర, టమాటాలను అసలు తినకూడదని డాక్టర్లు చెబుతున్నారు. కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
బాదంపప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కానీ పైన చెప్పినట్లుగా వీటిని మోతాదులోనే తినాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందేందుకు వీలు ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. బాదంపప్పులను తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. అధిక బరువు తగ్గుతారు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా, బలంగా మారుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. మోతాదులో బాదంపప్పులను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.