Obesity | చాలా మంది అధిక బరువు, స్థూలకాయం ఒక్కటేనని అనుకుంటారు. కానీ అధిక బరువు వేరు. స్థూలకాయం వేరు. అధిక బరువు అనేది శరీరం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉండడాన్ని సూచిస్తుంది. అదే స్థూలకాయం అయితే ఒక వ్యాధి అని చెప్పవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారికి శరీరమంతటా కొవ్వు చేరుతుంది. దీంతో బరువు ఎక్కువగా ఉంటారు. అధిక బరువు ఉన్నవారికి సాధారణంగా పొట్ట లేదా తొడలు, పిరుదుల వద్ద మాత్రమే కొవ్వు ఉంటుంది. కానీ స్థూలకాయం ఉంటే శరీరం మొత్తం కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో ఆయా భాగాలను కదిలించేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే అధిక బరువు, స్థూల కాయం రెండూ దాదాపుగా ఒక్కటే అయినప్పటికీ స్థూలకాయం బారిన పడ్డారంటే మాత్రం ఒక పట్టాన తగ్గదు. బరువును తగ్గించుకోవడం కోసం చాలా తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.
స్థూలకాయం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం, శారీరక శ్రమ చేయకపోవడం, నిత్యం కంప్యూటర్ ఎదుట లేదా అధిక గంటల పాటు కూర్చుని పనిచేయడం, శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడం, జన్యు సంబంధమైన సమస్యలు ఉండడం, వంశ పారంపర్యంగా స్థూల కాయం సమస్య ఉండడం, మెటబాలిజం దెబ్బ తినడం, వయస్సు మీద పడడం, నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, థైరాయిడ్ లేదా మహిళల్లో అయితే పీసీవోఎస్ సమస్యలు, డిప్రెషన్‌ను తగ్గించే మందులను ఎక్కువ రోజుల పాటు వాడడం, పర్యావరణ ప్రభావం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి స్థూలకాయం వస్తుంటుంది. స్థూలకాయం ఉన్నవారు ఎలాంటి మందులను వాడాల్సిన పనిలేదు. పలు జాగ్రత్తలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
స్థూలకాయం ఉన్నవారు పండ్లను, కూరగాయలను అధికంగా తింటుండాలి. క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బ్రౌన్ రైస్, కినోవా, ఓట్స్, తృణ ధాన్యాలను అధికంగా తినాలి. వీటిల్లోనూ ఫైబర్ అధికంగానే ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను పెరగకుండా చేస్తుంది. దీంతో ఆహారం మీద యావ తగ్గుతుంది. బరువు తగ్గేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చికెన్ బ్రెస్ట్, చేపలు, బీన్స్, పప్పు దినుసులు, సోయా తోఫు వంటి ఆహారాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాదు, కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. దీంతో బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా స్థూలకాయం తగ్గుతుంది.
క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాలను, తీవ్రంగా ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్‌ను, అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు ఉండే ఆహారాలు, సోడియం అధికంగా ఉండే ఆహారాలను స్థూలకాయం ఉన్నవారు తినరాదు. శీతల పానీయాలు, చక్కెర కలిగిన డ్రింక్స్, చాక్లెట్లు, స్వీట్లను కూడా ముట్టుకోకూడదు. స్నాక్స్ ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. మీ శరీరానికి, మీరు చేసే పనికి ఎంత ఆహారం అవసరమో అంతే తినాలి. రాత్రి పూట అన్నం మానేసి కేవలం 2 పుల్కాలను తినాలి. గ్రీన్ టీ తాగాలి. రాత్రి పూట ఒక కివి పండును తినాలి. నీళ్లను అధికంగా తాగాలి. రోజూ ఉదయం దానిమ్మ పండ్ల రసాన్ని ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం అయినా చేయాలి. ఆఫీసుల్లో పనిచేసే వారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. ఇలా జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే కచ్చితంగా స్థూలకాయం తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు.