Fatty Liver | ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న నివేదికల ప్రకారం రోజురోజుకూ కాలేయ సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ సంబంధిత కాలేయ సమస్యలే దీనికి ప్రధాన కారణం. కొన్నిసార్లు ఈ కాలేయ సమస్యలు మరణానికి కూడా దారి తీస్తాయి. కనుక ముందుగానే జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. సరైన ఆహారాన్ని తీసుకుంటూ, చక్కటి జీవనశైలిని అవలంబించడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నివారించవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ఏయే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి లేదా పూర్తిగా నివారించాలి.. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు అలాగే ఈ సమస్య భవిష్యత్తులో రాకూడదు అనుకునే వారు చక్కెర ఉండే ఆహారాలు, శీతల పానీయాలు, వెన్న, నెయ్యి, కొబ్బరి నూనె, పామాయిల్ ఉత్పత్తులు, జంక్ ఫుడ్ వంటి ఆహారాలను దూరంగా ఉంచాలి. మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. వీటికి బదులుగా బ్లాక్ టీని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా మన కాలేయంలో 5 శాతం మాత్రమే కొవ్వు ఉండాలి. దీని కంటే ఎక్కువ కొవ్వు ఉండడం వల్ల ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది. ఈ సమస్య కారణంగా కాలేయం ఉండాల్సిన దాని కంటే పెద్దగా ఉంటుంది. సాధారణ అల్ట్రాసౌండ్ ద్వారా ఫ్యాటీలివర్ సమస్యను గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలువబడే ఫ్యాటీలివర్ సమస్య తలెత్తుతుంది. ఈ స్థితిలో కాలేయ కణాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అదనంగా ఉండే ఈ కొవ్వు కాలేయ కణాల విధులకు ఆటంకం కలిగిస్తుంది. ఈ సమస్య ఎక్కువగా మద్యం సేవించడం వల్ల వస్తుంది. అలాగే ఊబకాయం, మధుమేహం కారణంగా జీవక్రియలు సరిగ్గా పనిచేయవు. దీని వల్ల కూడా ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది. ఈ ససమస్య ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. ఇటీవల కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్ గా ఉన్న సమస్య పేరును మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోసిస్ లివర్ డిసీజ్ గా మార్చారు. అదే విధంగా చాలా మంది తమకు ఫ్యాటీలివర్ సమస్య ఉన్నదని కూడా గుర్తించలేరు. ఈ సమస్య ఎటువంటి లక్షణాలను చూపించదు.
భోజనం చేసిన తరువాత కాలేయం ఉన్న చోట కొద్దిగా అసౌకర్యం వంటి భావన కలుగుతుంది. అలాగే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల కాలేయ ఆరోగ్యం మరింతగా దెబ్బతినే చికిత్స కూడా కష్టతరంగా మారుతుంది. కనుక ఫ్యాటీలివర్ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేయడం, మద్యపానానికి దూరంగా ఉండడం వల్ల ఫ్యాటీలివర్ సమస్య తగ్గడంతో పాటు రాకుండా కూడా ఉంటుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.