Rice | బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ముందుగా అన్నం, రాజ్మా-చావల్ వంటి ఇంటి వంటకాలను తమ ఆహారం నుంచి తొలగించాలని అనుకుంటారు. అయితే బరువు తగ్గడంలో అసలు కీలకమైన విషయం ఏం తింటున్నామన్నదే కాకుండా, ఒక ప్లేట్లో ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకుంటున్నామన్నదే. సరైన పరిమాణంలో ప్రొటీన్, కూరగాయలు, పీచు పదార్థాలు ఉండేలా ప్లేట్‌ను సమతుల్యంగా మార్చుకుంటే, ఇష్టమైన ఇంటి భోజనాన్ని కొనసాగిస్తూనే బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చు. అన్నం ఎక్కువగా, కూరగాయలు లేదా ఇతర పోషక పదార్థాలు తక్కువగా ఉండే భోజనం త్వరగా ఎక్కువ కేలరీలను అందిస్తుంది. అలాగే కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉండదు. దీనికి బదులుగా అన్నం పరిమాణాన్ని తగ్గించి, ప్రొటీన్, కూరగాయలు, సలాడ్, పెరుగు వంటి వాటిని పెంచడం ద్వారా అదే భోజనాన్ని మరింత సంతృప్తికరంగా మార్చుకోవచ్చ నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు, బరువు పెరగడానికి దారితీసే ప్లేట్లో 2 కప్పులు అంటే సుమారు 500 మిల్లీలీటర్ల అన్నంతోపాటు కేవలం ఒక చిన్న కటోరి (100 మిల్లీలీటర్లు) రాజ్మా, కొద్దిగా సలాడ్ ఉంటుంది. ఈ ప్లేట్లో ఎక్కువ భాగం పిండి పదార్థాలే ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణమవడం వల్ల కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అదే భోజనాన్ని బరువు తగ్గడానికి అనుకూలంగా మార్చాలంటే అన్నం పరిమాణాన్ని ఒక కటోరి (100 మిల్లీలీటర్లకు) తగ్గించాలి. అదే సమయంలో ప్రొటీన్‌ను పెంచేందుకు ఒక పెద్ద బౌల్ (200 మిల్లీలీటర్లు) మందమైన రాజ్మాను తీసుకోవాలి. దీనికి తోడు ఒక కటోరి పెరుగు, ఒక కటోరి సొరకాయ కూర, పెద్ద మొత్తంలో కచుంబర్ సలాడ్‌ను ప్లేట్లో చేర్చాలి.
ఇలా ప్లేట్లోని ఆహార నిష్పత్తులను మార్చడం వల్ల అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండానే భోజనంలో కూరగాయలు, పీచు పదార్థాలు, ప్రొటీన్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు. అదే సమయంలో మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గించడంతోపాటు, తక్కువ ఆహారంతో కాకుండా ఎక్కువ పరిమాణంలో సంతృప్తికరమైన ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది బరువు తగ్గలేకపోవడానికి ఇంట్లో తయారుచేసే భారతీయ వంటకాలనే కారణంగా భావిస్తుంటారు. కానీ సమస్య ఇంటి భోజనంలో కంటే, ప్లేట్‌ను ఏ విధంగా నింపుతున్నామన్నదానిలో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదిలేయడం కంటే, అన్నం వంటి కార్బొహైడ్రేట్ల పరిమాణాన్ని నియంత్రించి, ప్రొటీన్, కూరగాయలు, సలాడ్, పెరుగు వంటి వాటికి ఎక్కువ స్థానం ఇవ్వడం ద్వారా భోజనాన్ని సమతుల్యంగా మార్చుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.