Exercise | అధిక బరువు తగ్గించుకోవడం కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఎక్కువ కాలం జీవించడం కోసం కూడా చాలా మంది రోజూ వ్యాయామం చేస్తున్నారు. ఎంతటి ఉరుకుల పరుగుల బిజీ యుగం ఉన్నప్పటికీ వ్యాయామం కోసం చాలా మంది సమయం వెచ్చిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని తెలుసుకున్న చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే వ్యాయామం చేసేవారు చాలా మంది ఆరంభంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీంతో కొద్ది రోజుల పాటు వ్యాయామం చేసిన తరువాత పలు కారణాల వల్ల వ్యాయామం చేయడం మానేస్తుంటారు. కానీ ఆరంభంలో గనక ఈ జాగ్రత్తలను పాటించినట్లయితే మీరు ఎక్కువ రోజుల పాటు వ్యాయామం చేస్తారు. వ్యాయామం చేయడాన్ని కూడా ఆస్వాదిస్తారు. మధ్యలో ఆపేయరు. వ్యాయామం చేసేవారు ఆరంభంలో పాటించాల్సిన సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు వ్యాయామం చేయడం ప్రారంభించగానే అతిగా ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. భారీ బరువులు ఎత్తుతుంటారు. ఇలా చేస్తే త్వరగా వ్యాయామం చేయడం ఆపేస్తారు. ఇలా చేయకూడదు. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలు. ఆరంభంలో శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు. కాస్త అలవాటు అయ్యే కొద్దీ వ్యాయామం ఒత్తిడి, సమయం పెంచవచ్చు. ఆరంభంలో కష్టతరమైన వ్యాయామాలు కాకుండా సులభంగా చేసే వ్యాయామాలు చెయ్యాలి. వాకింగ్, స్విమ్మింగ్, సైకిల్ తొక్కడం లాంటివి చేయాలి. దీంతో మీకు తీవ్రమైన అలసట రాదు. ఇది మీరు ఎక్కువ కాలం పాటు వ్యాయామం చేయడానికి దోహదపడుతుంది. ఇక కొందరు ఆరంభంలో 2, 3 రోజులు వ్యాయామం చేసి మానేస్తారు. మళ్లీ గుర్తుకు వచ్చినప్పుడు ఎక్సర్సైజ్లు చేస్తారు. ఇలా చేయకూడదు. రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేసినా సరే రోజూ వ్యాయామం చేసేందుకు ప్రయత్నించండి. దీంతో వ్యాయామంపై మీకు ఆసక్తి ఏర్పడుతుంది.
వ్యాయామం చేసేవారు స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ కూడా చేయాలి. అంటే తేలికపాటి బరువులను ఎత్తాలి. దీంతో కొవ్వును వేగంగా కరిగించుకోవచ్చు. అయితే ఈ వ్యాయామాలను మరీ అతిగా చేయకూడదు. లేదంటే శరీరంపై భారం పడుతుంది. తరువాత వ్యాయామం మానేసే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాయామం చేసే సమయంలో మీకు కష్టంగా అనిపిస్తే కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ వ్యాయామం చేయండి. అంతేకానీ ఇబ్బందిగా ఉందని వ్యాయామం చేయడం ఆపవద్దు. కొన్ని కొన్ని నిమిషాల పాటు చేసినా మధ్యలో రెస్ట్ తీసుకుని వ్యాయామం చేస్తుంటే మీకు వ్యాయామంపై బోర్ కొట్టదు.
వ్యాయామం చేయడం వల్ల రాత్రికి రాత్రే బరువు తగ్గిపోతారని, ఏదో అద్భుతం జరుగుతుందని అనుకోవద్దు. ఇలా జరిగేందుకు కాస్త సమయం పడుతుంది. ఇందుకు గాను రోజూ స్థిరంగా వ్యాయామం చేయాలి. అలాగే అలవాటు అయ్యే కొద్దీ సమయం పెంచాలి. దీంతో మీరు అనుకున్న గోల్‌ను త్వరగా రీచ్ అయ్యేందుకు చాన్స్ ఉంటుంది. అలాగే రోజూ ఒకే తరహా వ్యాయామం కాకుండా కాసేపు యోగా చేయండి. కాసేపు వెయిట్ ట్రెయినింగ్ చేయండి. కాసేపు కార్డియో వ్యాయామం చేయండి. ఇలా చేస్తుంటే ఎక్సర్సైజ్పై మీకు బోర్ గా అనిపించదు. ఎక్కువ రోజుల పాటు వ్యాయామం చేయగలుగుతారు. అలాగే వ్యాయామం మొదలు పెడితే సరైన పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే శరీరం త్వరగా రికవరీ కాదు. అలాగే నీళ్లను కూడా ఎక్కువగా తాగాలి. ఇలా పలు సూచనలను వ్యాయామం ప్రారంభించే వారు పాటిస్తే వ్యాయామం పట్ల మక్కువ ఏర్పడుతుంది. దీర్ఘకాలం పాటు వ్యాయామం చేసేందుకు ఇది దోహదపడుతుంది.