Spinach Juice | పాలకూర మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటుంది. పాలకూరతో చేసే వంటలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీంతో అనేక కూరలు, ఇతర వంటకాలను చేయవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే పాలకూరను తరచూ తినాలని పోషకాహార నిపుణులు కూడా చెబుతుంటారు. పాలకూరలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని పోషకాలకు నెలవుగా అభివర్ణిస్తుంటారు. పాలకూరను రోజూ తినడం కన్నా జ్యూస్ చేసి తాగితే మేలు అని చాలా మంది బావిస్తుంటారు. ఉదయం పరగడుపునే దీని జ్యూస్‌ను తాగుతుంటారు కూడా. అయితే పాలకూర జ్యూస్‌ను రోజూ తాగే వారు కొన్ని జాగ్రత్తలను తప్పక పాటించాలని, లేకపోతే లాభం కలగకపోగా నష్టం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ జాగ్రత్తలు ఏమిటంటే..
పాలకూర జ్యూస్‌ను రోజుకు 120 నుంచి 240 ఎంఎల్ మోతాదులోనే తాగాలని, అంతకు మించి తాగకూడదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలకూర జ్యూస్‌ను వారంలో 3 లేదా 4 సార్లు తాగితే చాలు, రోజూ తాగాల్సిన పనిలేదని వారు అంటున్నారు. కేవలం పాలకూర జ్యూస్‌ను మాత్రమే కాకుండా దాంతోపాటు ఇతర పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకుంటే సమతుల ఆహారం లభిస్తుందని వారు అంటున్నారు. అయితే పాలకూర జ్యూస్‌ను ఎప్పుడూ ఒక పోషక పదార్థంగా భావించాలి తప్ప తినే ఆహారానికి బదులుగా కేవలం ఈ జ్యూస్‌ను మాత్రమే తాగి ఉండకూడదని అంటున్నారు. ఇతర ఆహారాలను కూడా తినాలని వారు సూచిస్తున్నారు.
పాలకూర జ్యూస్‌తోపాటు విటమిన్ సి లభించేలా చూసుకోవాలి. దీంతో పాలకూరలో ఉండే ఐరన్‌ను శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది. అందుకు గాను పాలకూర జ్యూస్‌లో కొద్దిగా నిమ్మ లేదా నారింజ రసం కలిపి తాగాల్సి ఉంటుంది. దీంతో ఐరన్ సమృద్ధిగా లభించి రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర జ్యూస్‌ను నేరుగా తాగితే జీర్ణ వ్యవస్థపై భారం పడే అవకాశం ఉంటుంది. కనుక అందులో కొద్దిగా ఏదైనా ఇతర పండ్ల రసం లేదా నీరు కలిపి తాగితే మంచిది. పాలకూర జ్యూస్‌ను తాగడం కొత్తగా మొదలు పెట్టేవారు ముందు చిన్న మొత్తంలో తాగడం మంచిది. తరువాత ఎక్కువ పరిమాణం పెంచవచ్చు. లేదంటే జీర్ణ వ్యవస్థపై భారం పడే అవకాశం ఉంటుంది.
కిడ్నీ స్టోన్లు ఉన్నవారు లేదా మూత్రాశయం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు పాలకూర జ్యూస్‌ను తాగకూడదు, పాలకూరను కూడా తినకూడదు. రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు కూడా ఈ జ్యూస్‌ను తాగకూడదు. కొందరికి పుడ్ అలర్జీలు ఉంటాయి. అలాంటి వారు డాక్టర్ సూచన మేరకు పాలకూర జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది. పాలకూర జ్యూస్‌ను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.