షుగర్ వ్యాధి.. దాని పేరులోనే తీపిదనం ఉంది. కానీ ఇది తియ్యటి విషంలా మనిషి ప్రాణాలను తోడేస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి ప్రారంభం నుంచి తీవ్రమయ్యే వరకు శరీరంలో ఎలాంటి ఇబ్బందులు అనిపించవు. ఫలితంగా వ్యాధిని గుర్తించే వీలు ఉండదు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రోగం బయటపడుతుంది. అంటే రోగికి ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు గానీ, లేదా శస్త్రచికిత్సలు చేసే సమయంలో గానీ షుగర్ ఉన్నట్లుగా తెలిసొస్తుంది. అంటే వ్యాధి బయటపడే సమయానికి జరగరాని నష్టం జరిగిపోతుందన్నమాట. అందుకే దీనిని వైద్య పరిభాషలో స్వీట్ పాయిజన్‌గా పరిగణిస్తారు. అసలు మధుమేహం అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? మధుమేహం వల్ల కలిగే అనర్థాలు, అది రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించాల్సిన చికిత్స తదితర అంశాలపై నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
ప్రస్తుతం షుగర్ వ్యాధి చాలామందిలో సర్వసాధారణమైపోయింది. వ్యాధి ఉన్నట్లు తెలియకపోవడం వల్ల ఎందరో రోగులు మొదటి మూడు దశలు దాటి డేంజర్ జోన్లోకి వచ్చేస్తున్నారు. ఈ రుగ్మతను ప్రారంభ దశలో గుర్తించగలిగితే.. దానిని నియంత్రించవచ్చు. అంతేకాకుండా వ్యాధి వచ్చే అవకాశాలను ముందుగానే అంచనావేసి, వ్యాధి రాకుండా అరికట్టవచ్చు. కానీ, 80 శాతం మంది రోగులు మూడు దశల తర్వాతే వ్యాధి ఉన్నట్లు తెలుసుకొని ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మధుమేహానికి మనదేశం ప్రపంచ రాజధానిగా మారింది. అవగాహన లేమి, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి తదితర కారణాలతో రోజురోజుకూ డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది.
మధుమేహం అనేది మన శరీరంలో మూడు రకాల పదార్థాలు పెరగడం వల్ల వస్తుంది. అవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. వీటినే సాధారణ చక్కెరలుగా పిలుస్తారు. ఈ పదార్థాలు మనం తినే ఆహారంలో ఉండి తీపిదనాన్ని అందిస్తాయి. సాధారణంగా శరీరం పలు రకాల సంక్లిష్ట పిండి పదార్థాలను గ్లూకోజ్‌గా మారుస్తుంది. అయితే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి పెరగడంతో ‘ప్యాంక్రియాటిక్ బీటా’ కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. విడుదలైన ఇన్సులిన్ సమక్షంలో బీటా కణాలు శక్తిని ఉత్పన్నం చేయడానికి గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి. ఇక ఫ్రక్టోజ్ విషయానికి వస్తే ఇది పండ్లలో, తీపి పానీయాలు, చల్లని పానీయాలలో లభిస్తుంది. ఫ్రక్టోజ్ వల్ల ఊబకాయం, కాలేయంలో కొవ్వు, ఇన్సులిన్ నిల్వలు పెరుగుతాయి.
సుక్రోజ్ మనం వినియోగించే సాధారణ చక్కెర. ఇది చెరుకు నుంచి తయారవుతుంది. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు ఉంటాయి. ఈ మూడు పదార్థాలు ఒక గ్రాముకు సమాన మోతాదులో క్యాలరీలను అంటే శక్తిని విడుదల చేస్తాయి. శరీరంలో అధికంగా శక్తి విడుదల కావడంతో అది కొవ్వుగా మారి పేరుకుపోతుంది. ఫలితంగా శరీరంలోని ప్రధాన భాగాలైన గుండె, కిడ్నీలతో పాటు కండరాలకు రక్తం సరఫరా సన్నగిల్లుతుంది. అంతే కాకుండా కొవ్వు పెరిగిపోవడంతో ఊబకాయం కూడా వచ్చేస్తుంది. శరీరంలో తీపి పదార్థాల వల్ల అధికశక్తి విడుదల అవుతున్నందున ఈ వ్యాధిని చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధి అని పిలుస్తారు.
ప్రధానంగా డయాబెటిస్ రెండు రకాలు. అందులో ఒకటి టైప్-1 డయాబెటిస్, రెండోది టైప్-2 డయాబెటిస్. ఎక్కువ మందిలో కనిపించేది టైప్-2 డయాబెటిసే. హార్మోన్లలో మార్పుల వల్ల కొంతమంది గర్భిణుల్లో షుగర్ స్థాయులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా గర్భధారణ సమయంలో డయాబెటిస్ రావడాన్ని జస్టేషనల్ డయాబెటిస్ అంటారు.
టైప్-1 డయాబెటిస్: ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే రోగి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై పొరపాటున దాడి చేసి, వాటిని నాశనం చేస్తుంది. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి శరీరంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. టైప్-1 డయాబెటిస్‌కు కచ్చితమైన కారణాలు చెప్పలేం. జెనెటికల్‌గా కానీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం లేకపోలేదు.
టైప్-2 డయాబెటిస్: ప్రస్తుతం ఉన్న డయాబెటిస్ రోగుల్లో 90 శాతం మంది టైప్-2 బాధితులే. జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగానే దీని బారినపడుతున్నారు. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమగ్రంగా వినియోగం కాకపోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుంది. అంతేకాకుండా ఊబకాయం వల్ల కూడా ఇది సంభవిస్తుంది. దీనివల్ల చిన్న రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు ప్రభావితం అవుతున్నాయి. మన భారతీయులకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అధికంగా ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ కారణంగా సెంట్రల్ ఒబేసిటీ అధికంగా వస్తుంది. అంటే పొట్ట వద్ద ఎక్కువగా కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల విసరల్ ఫ్యాట్ కూడా అధికంగా పేరుకుపోతుంది. ఇదిలా ఉండగా ఊబకాయం లేకుండా సన్నగా ఉన్నవారిలో కూడా డయాబెటిస్ వస్తున్నది. దానికి కారణం విసరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండటమే.
వంశపారంపర్యంగా. జీన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ (ఏపీ జెనెటిక్స్). వ్యాయామం లేకపోవడం. పిండి పదార్థాలు ఎక్కువగా, ప్రొటీన్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.
జీన్ డైల్యూషన్ లేకపోవడం.. అంటే ఒకే తెగకు చెందిన వారిని వివాహం చేసుకోవడం వల్ల జన్యువులు మరింత బలపడతాయి. అదే ఒక తెగ వారు మరో తెగకు చెందిన వారిని వివాహం చేసుకోవడం వల్ల జీన్ డైల్యూషన్ జరుగుతుంది. జీన్ డైల్యూషన్ వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది.
జంక్ ఫుడ్, గ్రామీణ వాతావరణం తగ్గి, పట్టణ వాతావరణం పెరగడం.
జీవన శైలి, ఆహారపు అలవాట్లు.
డయాబెటిస్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, గుండె లాంటి ప్రధాన అవయవాల వద్ద కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల ఈ అవయవాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో 10.5 శాతం ప్రివిలెన్స్ ఆఫ్ డయాబెటిక్ ఉండగా తెలంగాణలో 18 శాతంగా ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంటున్నది. డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టకపోతే అది రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. చిన్న రక్తనాళాలపై ప్రభావం చూపితే కళ్లు, కిడ్నీలు దెబ్బతింటాయి. పెద్ద రక్తనాళాలు ప్రభావితం అయితే గుండె, పాదాలు దెబ్బతింటాయి.
ఇప్పుడు కొత్తగా వచ్చే మందులు విసరల్ ఫ్యాట్, బరువు తగ్గడానికి బాగా పనిచేస్తున్నాయి. ఈ మందులతో 22 శాతం వరకు బరువును తగ్గించవచ్చు. ఈ విధంగా బరువు తగ్గితే డయాబెటిస్ రివర్సల్ గానీ, రెమిషన్ అవ్వడానికి అవకాశం ఉంది. సాధారణంగా బరువు తగ్గితే విసరల్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అందువల్ల డయాబెటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ను నివారించవచ్చు.
హెల్త్ స్క్రీనింగ్ అనేది కనీసం 30 ఏండ్ల వయసు నుంచే మొదలుపెట్టాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 20 ఏండ్ల వారికీ డయాబెటిస్ వస్తున్నది. ప్రీ-డయాబెటిస్ నుంచి డయాబెటిస్ కిందకు మారడానికి సుమారు 4 సంవత్సరాల సమయం పడుతుంది. చాలా మందిలో ప్రీ-డయాబెటిస్లోనే గుండె సమస్యలు మొదలవుతాయి. అయితే ప్రీ-డయాబెటిస్‌లో నియమాలు పాటించినవారు రివర్సల్‌కు వెళ్లిపోతారు. పాటించని వారు డయాబెటిస్ పాలపడతారు. బలమైన జన్యువులు ఉన్నవారు మాత్రం ప్రీ-డయాబెటిస్ కిందనే ఉండిపోయే అవకాశం ఉంటుంది.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ నడిమింటి గణపతి శాస్త్రి
డయాబెటలాజిస్ట్
జీవీకె డయాబెటిస్ కేర్, మెడికల్ డైరెక్టర్
జూబ్లీహిల్స్, హైదరాబాద్