షాక్ అబ్జార్బర్స్ వాహనాలను కుదుపులు లేకుండా ప్రయాణించేలా సహకరిస్తాయి. మనిషిలో వెన్నెముకలో ఉండే డిస్క్ కూడా అంతే. మనిషి నడవడం, కూర్చోవడం, పరిగెత్తడంలో ఇబ్బందులు పడకుండా దోహదం చేస్తాయి. ఏవైనా కారణాల వల్ల డిస్క్‌లో సమస్య ఏర్పడితే మనిషికి శారీరకంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. దీంతో కూర్చోవడం కష్టమైపోతుంది. సరిగ్గా నిలబడటం కలగా మారుతుంది. నడవడం నరకంగా ఉంటుంది. కాబట్టి, మన ఉనికికి కీలకమైన డిస్క్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.
Spondylosis | ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది నడుమునొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఉరుకులు పరుగుల జీవనం, గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే ఉద్యోగాలు, సరైన పర్యవేక్షణ లేని కసరత్తులు, గుంతలు ఉన్న రోడ్లపై ప్రయాణం మొదలైన కారణాల వల్ల ఇలాంటి రుగ్మతలు దాపురిస్తున్నాయి. చాలామందికి వీటికి గల కారణాలు తెలియవు. దీంతో పెయిన్ కిల్లర్స్‌తో కాలం గడిపేస్తారు. సమస్య ముదిరిపోయాక గానీ డాక్టర్లను సంప్రదించడం లేదు. డిస్క్, స్పాండిలోసిస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో… అసలు ఈ డిస్క్, స్పాండిలోసిస్ అంటే ఏంటి? నడుమునొప్పి, మెడనొప్పికి వీటికి గల సంబంధం, వీటి లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, చికిత్స గురించి తెలుసుకుందాం.
వెన్నెముకలో రెండు ఎముకల మధ్య ఉండే గుజ్జు వంటి పదార్థాన్ని డిస్క్ అంటారు. వాహనాలకు షాక్ అబ్జార్బర్స్ ఎలానో మనిషికి డిస్క్ అలా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల నడుము భాగంలో కండరాలు బలహీనపడతాయి. దీంతో డిస్క్‌కు సంబంధించిన ఇబ్బందులు త్వరగా తలెత్తే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు కూర్చుని ప్రయాణాలు చేయడం వల్ల, రోడ్ల మీద గుంతలతో శరీరం కుదుపునకు గురవడం వంటి కారణాలతో కూడా డిస్క్ సమస్యలు వస్తాయి. మితిమీరిన బరువులు ఎత్తడం, సరైన పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా వ్యాయామం చేయడం కూడా డిస్క్ ఆరోగ్యానికి మంచిది కాదు. సాధారణంగా వెన్నెముక ఎముకల మధ్యలో ఉండే గుజ్జు బయటికి వచ్చి, మెడభాగంలోని నరాలపై ఒత్తిడి చేయడం వల్ల నొప్పితోపాటు కాళ్లు, చేతులు బలహీనంగా మారే ముప్పు పొంచి ఉంటుంది. ఇంకా నడుము భాగంలో గుజ్జు బయటికి వచ్చి నరాలపై ఒత్తిడి చేసినప్పుడు కాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంది. దీన్ని సయాటికా అని పిలుస్తారు. వైద్య పరిభాషలో అయితే ‘రాడిక్యులోపతి’ అని కూడా అంటారు.
వయసు కారణంగా వెన్నుపూస, డిస్క్‌లో వచ్చే మార్పులను స్పాండిలోసిస్ అంటారు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ డిస్క్‌లో నీటి శాతం తగ్గుతుంది. దీనివల్ల డిస్క్‌లో ఎలాస్టిసిటీ (సులువుగా కదిలే తత్వం) తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు రాపిడికి గురై అరిగిపోతాయి. దీంతో నడుము లేదా మెడభాగంలో తీవ్రమైన నొప్పి, బిగుసుకుపోవడం (స్టిఫ్నెస్) వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మామూలుగా అయితే 40 ఏండ్ల తర్వాత ఈ సమస్య మొదలవుతుంది. అలా కాకుండా ఏవైనా ప్రమాదాలు, గాయాలకు గురైన వారిలో చిన్న వయసులోనే స్పాండిలోసిస్ తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇది సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అని రెండు రకాలుగా ఉంటుంది.
మెడ భాగంలో స్పాండిలోసిస్ ఏర్పడితే దానిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.
నడుము భాగంలో స్పాండిలోసిస్ ఏర్పడితే అది లంబార్ స్పాండిలోసిస్.
వెన్నుపూసలో రెండు ఎముకలు ఒకదానిపై మరొకటి సమాంతరంగా ఉంటాయి. అయితే, వయసు పైబడటం లేదా ప్రమాదాలు జరగడం వల్ల ఎముకలు ముందూ వెనక్కి జరిగిపోతాయి. దీన్నే స్పాండిలోలిస్థెసిస్ అంటారు.
ఇది 70 ఏండ్లు దాటిన వారిలో వస్తుంది. వెన్నుపూస ఎముకలు పూర్తిగా బలహీనపడి, చిన్నపాటి గాయమైనా విరిగిపోతాయి. దీన్ని ఆస్టియోపొరోటిక్ ఫ్రాక్చర్ అని వ్యవహరిస్తారు.
స్పాండిలోసిస్, డిస్క్ సమస్యలకు సంబంధించిన నిర్ధారణ పద్ధతులు ఒకే విధంగా ఉంటాయి. అయితే, రోగి లక్షణాల ఆధారంగా అది స్పాండిలోసిసా లేక డిస్క్ సమస్యనా అనేది గుర్తిస్తారు. ఎక్స్-రే, ఎలక్ట్రోమయోగ్రఫీ (ఈఎంజీ)/ నర్వ్ కండక్షన్ వెలాసిటి (ఎన్సీవీ), ఎంఆర్ఐ, సీటీ-స్కాన్ వంటి పరీక్షల ద్వారా సమస్యను కచ్చితంగా గుర్తిస్తారు.
మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ అని చికిత్సలో రెండు రకాల పద్దతులు ఉంటాయి.
లక్షణాల ఆధారంగా చికిత్సను ప్రారంభిస్తారు. అదే సమయంలో ఫిజియోథెరపీ కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో మందులు పనిచేయనప్పుడు మెడ, నడుము భాగంలో ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
సమస్య తీవ్రంగా ఉండి, మందులతో తగ్గలేని స్థితిలో ఉంటే సర్జరీ చేయాలి. దీని ద్వారా బయటికి వచ్చిన గుజ్జు భాగాన్ని తొలగించి, నరాలపై పడే ఒత్తిడిని దూరం చేస్తారు. దీంతోపాటు నరానికి సరిపోయే స్థలాన్ని ఏర్పాటుచేస్తారు. ఈ సర్జరీని మైక్రోస్కోప్ లేదా ఎండోస్కోప్ పద్ధతులను ఉపయోగించి చేయవచ్చు. సర్జరీ తర్వాత రోగిని వెంటనే నడిపించడంతోపాటు మర్నాడే డిశ్చార్జ్ చేస్తారు. ఆ తర్వాత వైద్యులు సూచించన జాగ్రత్తలు పాటిస్తూ ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఇక ఆస్టియోపొరోటిక్ ఫ్రాక్చర్స్ బాధితులకు మాత్రం ‘ఆర్టిఫీషియల్ బోన్ సిమెంట్’ ద్వారా వెన్నుపూస ఫ్రాక్చర్ సమస్యకు చికిత్స అందిస్తారు. అయితే, వెన్నెముక సమస్య అనగానే సహజంగానే భయం, ఆందోళన చెందుతారు. కానీ, అన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం పడదు. చాలావరకు సమస్యను మందులతోనే పరిష్కరించుకోవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోజువారీ జీవితాన్ని గడిపేయవచ్చు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ ఎ.అజయ్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్, న్యూరో సర్జన్ (బ్రెయిన్, స్పైన్) స్టార్ హాస్పిటల్, హైదరాబాద్