Rose Water | చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు మార్కెట్లో మనకు అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది సహజసిద్ధమైన ప్రొడక్ట్స్‌ను వాడేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఎందుకంటే వీటి వల్ల చర్మంపై ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ పడకుండా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక అలాంటి ఉత్పత్తుల్లో రోజ్ వాటర్ కూడా ఒకటి. దీన్ని అనేక సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. గులాబీ పువ్వుల రెక్కలను నీటితో కలిపి డిస్టిలేషన్ అనే ప్రక్రియ ద్వారా రోజ్ వాటర్‌ను తయారు చేస్తారు. ఇందులో చర్మాన్ని సంరక్షించే అనేక గుణాలు ఉంటాయి. యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోజ్ వాటర్‌లో ఉంటాయి. కనుక దీన్ని కేవలం చర్మానికే కాకుండా జుట్టుకు కూడా వాడవచ్చు. రోజ్ వాటర్ ను ఎలా వాడితే ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ వాటర్ చర్మానికి చక్కని రంగు అందించడంతోపాటు చర్మాన్ని శుద్ధి చేసే క్లీన్సర్‌గా కూడా పనిచేస్తుంది. ఇందుకు గాను చల్లని రోజ్ వాటర్ లో కాటన్ ప్యాడ్‌ను ముంచి దాంతో ముఖం, మెడ, చేతులపై సున్నితంగా మర్దనా చేసినట్లు రాయాలి. రాత్రి పూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే చర్మం చక్కని రంగును పొందుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం పీహెచ్ స్థాయిలను నిర్వహించడంలో రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై అదనంగా ఉండే నూనెను తగ్గిస్తుంది. చర్మ రంధ్రాల్లో ఉండే దుమ్ము, ధూళి, మృత కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఇక రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కనుక దీన్ని వాడితే చర్మంపై ఉండే ఎరుపు దనం, వాపులు తగ్గిపోతాయి. మొటిమలకు కూడా పనిచేస్తుంది. డెర్మటైటిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలకు సైతం రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది.
కొన్ని చుక్కల రోజ్ వాటర్‌ను మీరు వాడే మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా ఆయిల్లో కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పూట ముఖానికి రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. దీంతో ఉదయాన్నే మీ ముఖం తాజాగా కనిపిస్తుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది. తేమగా కూడా ఉంటుంది. కళ్ల కింద ఉండే వాపులు సైతం తగ్గిపోతాయి. ముఖంపై ముడతలు ఉన్నవారు ఈ చిట్కాను పాటిస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. చల్లని రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్లను ముంచి వాటిని కళ్లపై 10 నుంచి 15 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇలా రోజూ చేయాలి. దీని వల్ల కళ్ల కింద ఉండే వాపులు, డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అందంగా కనిపిస్తాయి. ముల్తానీ మట్టి లేదా శనగపిండిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేయవచ్చు. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై చర్మ రంధ్రాల్లో ఉండే దుమ్ము, ధూళి, మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖానికి సహజసిద్ఠమైన నిగారింపు వస్తుంది.
కేవలం చర్మానికే కాకుండా జుట్టుకు కూడా రోజ్ వాటర్ పనిచేస్తుంది. రోజ్ వాటర్‌ను కొద్దిగా తీసుకుని దాన్ని నేరుగా జుట్టుకు రాసి 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. దీని వల్ల శిరోజాలు మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తాయి. చక్కని సువాసన కూడా వస్తాయి. అలాగే మెంతుల పొడిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని శిరోజాలకు పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. దీని వల్ల తలలో ఉండే దురద, చుండ్రు తగ్గుతాయి. జుట్టు రాలడం తగ్గిపోతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మేకప్‌ను తొలగించేందుకు కూడా రోజ్ వాటర్ పనిచేస్తుంది. రోజ్ వాటర్‌ను కొద్దిగా తీసుకుని దానికి అంతే మోతాదులో కొబ్బరినూనె లేదా బాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని మేకప్ తొలగించేందుకు వాడవచ్చు. ఇలా రోజ్ వాటర్‌ను చర్మం, శిరోజాలకు వాడి అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.