Chia Seeds | ఈమధ్య కాలంలో చియా సీడ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఎక్కడ చూసినా చాలా మంది ఈ సీడ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు కూడా మనకు చియా సీడ్స్ తినాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో ఎక్కడ చూసినా చియా సీడ్స్‌కు సంబంధించిన పోస్టులు, రీల్స్, వీడియోలు మనకు దర్శనమిస్తున్నాయి. చియా విత్తనాలను చాలా మంది నీటిలో నానబెట్టి తింటుంటారు. అధిక బరువును తగ్గించడంలో ఈ విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. చియా సీడ్స్‌ను అందుకనే సూపర్ ఫుడ్‌గా కూడా పిలుస్తారు. చియా విత్తనాలను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక గుండెకు కూడా మేలు జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
రోజుకు కనీసం 5 టేబుల్ స్పూన్లు లేదా 50 గ్రాముల చియా సీడ్స్‌ను తినవచ్చు. చియా సీడ్స్‌ను తినడం వల్ల కొలెస్ట్రాల్‌తోపాటు ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. అధిక బరువు తగ్గేందుకు చియా విత్తనాలను తినాలని డైటిషియన్లు కూడా సూచిస్తుంటారు. అధిక బరువును తగ్గించడమే కాకుండా ఈ విత్తనాలు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసేందుకు కూడా పనిచేస్తాయి. ఈ సీడ్స్‌లో ఫైబర్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ విత్తనాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మనకు పోషణ లభిస్తుంది.
అయితే చియా విత్తనాలను తినడం వల్ల మేలే జరిగినప్పటికీ అధికంగా తింటే మాత్రం ప్రమాదం ఉంటుందని, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చియా విత్తనాలను అధికంగా తినడం వల్ల షుగర్ లెవల్స్ మరీ పడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. డయాబెటిస్ మందులను వాడేవారిలో దుష్పరిణామాలు ఎదురవుతాయని అంటున్నారు.
చియా విత్తనాలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అయితే చియా విత్తనాలను ఎల్లప్పుడూ నానబెట్టి మాత్రమే తినాలి. విత్తనాలను అలాగే తింటే సమస్యలు ఎదురవుతాయి. నీళ్లు తగిలితే ఈ విత్తనాలు జెల్లా మారుతాయి. కనుక వీటిని నీటితోనే తీసుకోవాలి. నీరు లేకుండా తీసుకుంటే జీర్ణవ్యవస్థలో ఈ విత్తనాలు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో మలం బయటకు రాదు. అప్పుడు సమస్య ఎదురవుతుంది. కనుక ఈ విత్తనాలను ఎట్టి పరిస్థితిలోనూ నీటితోనే తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
చియా విత్తనాలను నేరుగా తింటే అవి కొందరికి గొంతులోనే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా కొందరికి తీవ్రమైన మలబద్దకం లేదా విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక చియా విత్తనాలను తినే వారు కచ్చితంగా నీటిలో నానబెట్టిన తరువాత మాత్రమే తినాల్సి ఉంటుంది. ఈ విత్తనాలను తింటే బీపీ తగ్గుతుంది. కనుక బీపీ మందులను వాడేవారు డాక్టర్ సలహా మేరకు ఈ సీడ్స్‌ను తీసుకోవాలి. చియా విత్తనాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ వీటిని తినే విషయంలో మాత్రం కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.