Junk Food | సాయంత్రం అయిందంటే చాలు.. పొట్టలో కాస్త ఆకలిగా ఉంటుంది. దీంతో చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. బయట లభించే బజ్జీల వంటి నూనె పదార్థాలతోపాటు బేకరి ఉత్పత్తులను కూడా అధికంగా తింటుంటారు. అయితే జంక్ ఫుడ్‌ను తరచూ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది తెలిసి కూడా కొందరు తరచూ వీటిని తింటుంటారు. రోగాల బారిన పడుతుంటారు. జంక్ ఫుడ్ ఎలాంటిదంటే.. కాస్త తింటే చాలు.. ఎవరైనా సరే అడిక్ట్ అవుతారు. దీంతో తిన్న కొద్దీ అలాంటి ఫుడ్‌ను తినాలనిపిస్తుంది. ఫలితంగా కంట్రోల్ ఉండదు. ఆహారపు అలవాటు తప్పుతుంది. జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటారు. ఇది బరువు పెరిగేందుకు, గుండె జబ్బులు వచ్చేందుకు కారణం అవుతుంది.
అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఎవరైనా సరే జంక్ ఫుడ్ అలవాటును మానేయవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. తాజా పండ్లను మీకు అందేంత దగ్గర్లో పెట్టుకోండి. మీరు ఆఫీస్‌లో పనిచేస్తే గనక ముందుగానే లంచ్, స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. స్నాక్స్‌కు కూడా వేరే బాక్స్‌ను పెట్టుకోండి. అందులో పండ్ల ముక్కలు మీకు ఇష్టమైనవి పెట్టుకోండి. వాటిని చేతికి అందేంత దూరంలో ఉంచుకోండి. మీకు జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఆ పండ్ల ముక్కలను తినండి. ఇలా తరచూ తింటుంటే జంక్ ఫుడ్ తినే అలవాటును మానేస్తారు. పైగా స్నాక్స్ లాగా పండ్లను తింటారు కనుక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
సూపర్ మార్కెట్లకు బదులుగా మీకు దగ్గరలో ఉన్న కిరాణా షాపుకు వెళ్లి మీకు కావల్సిన సరుకులు తెచ్చుకోండి. దీంతో మీరు జంక్ ఫుడ్‌ను చూడరు. ఆ పదార్థాలను తెచ్చుకోరు. అదే మీరు సూపర్ మార్కెట్‌కు వెళితే మీకు జంక్ ఫుడ్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీంతో కచ్చితంగా వాటిని కొని తెస్తారు. కాబట్టి ఏదైనా కిరాణా షాపులో సామాను తెచ్చుకోండి. అయితే సూపర్ మార్కెట్లలో తక్కువ ధరకు సామాన్లు వస్తాయని అనుకుంటే అక్కడికే వెళ్లండి. కానీ జంక్ ఫుడ్స్‌ను మాత్రం కొనకండి. వాటిని కొని తెస్తే కచ్చితంగా తింటారు. కనుక వాటిని కొనడం మానేయండి.
మీ రోజువారి ఆహారంలో జంక్ ఫుడ్స్‌ను స్నాక్స్‌గా తినే బదులు నట్స్, గింజలను తినండి. ఇవి రుచిగా ఉండడమే కాదు, పోషణ, శక్తిని అందిస్తాయి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే స్నాక్స్ తినే సమయంలో ఏవైనా ఆరోగ్యకరమైన ఆహారాలను దగ్గర పెట్టుకోండి. దీంతో కాస్త ఆకలిగా అనిపించగానే వాటిని తింటారు. దీని వల్ల జంక్ ఫుడ్ మీదకు ధ్యాస పోదు. అలాగే కొందరు టీవీల్లో సినిమాలు లేదా క్రికెట్ చూస్తూ జంక్ ఫుడ్‌ను లాగించేస్తారు. ఆ పని చేయడం మానుకోండి. అలాగే మీకు ఆకలిగా అనిపించినప్పుడు కాసిన్ని నీళ్లు తాగండి. నిజమైన ఆకలి అయితే నీళ్లు తాగినా అవుతుంది. అప్పుడు పండ్లు లేదా నట్స్ తినండి. దీంతో ఆకలి కంట్రోల్ అవుతుంది. ఇలా పలు ఆహారాలను తీసుకుంటూ జాగ్రత్తలను పాటిస్తే జంక్ ఫుడ్ తినడం ఈజీగా మానేయవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.