Cholesterol | ప్రస్తుతం చాలా మంది నిత్యం గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నారు. దీని వల్ల ఒత్తిడి బారిన పడుతున్నారు. అలాగే శారీరక శ్రమ కూడా ఉండడం లేదు. అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్రించడం లేదు. జంక్ ఫుడ్‌కు బాగా అలవాటు పడ్డారు. ఇంట్లో వండిన ఆహారాల కన్నా బయటి ఆహారాలనే అధికంగా తింటున్నారు. అలాగే ధూమపానం, మద్యపానం చేస్తున్నారు. ఇవన్నీ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు కారణాలు అవుతున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ చేరితే రక్తనాళాల్లో అడ్డంకులు వస్తాయి. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా అది హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది. కనుక హార్ట్ ఎటాక్ రావొద్దంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవన శైలిని పాటించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది ఇళ్లలో పసుపును విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇది మనకు నిజంగా ఆరోగ్య ప్రదాయిని అని చెప్పవచ్చు. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తనాళాలను క్లీన్ చేసి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కనుక పసుపును రోజూ ఏదో ఒక విధంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు.
కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో తులసి ఆకులు కూడా బాగానే పనిచేస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ ఆకులు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి. అందువల్ల తులసి ఆకులను రోజూ 4 చొప్పున పరగడుపునే తింటుంటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కరిగించుకోవచ్చు. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మెంతులు కూడా బాగానే పనిచేస్తాయి. వీటిల్లో ఫైబర్ అదికంగా ఉంటుంది. అలాగే సాపోనిన్స్ అనే సమ్మేళనాలు మెంతుల్లో ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా ఉండే కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తాయి. రాత్రి పూట మెంతులను కొన్ని తీసుకుని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే వీటిని తినాలి. ఇలా చేస్తుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి.
శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో దాల్చిన చెక్క కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. దీన్ని రోజూ కషాయం రూపంలో తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రోజూ ఉదయం అల్లం రసం సేవించడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కనుక వెల్లుల్లిని కూడా రోజూ తినాలి. రోజూ ఉదయం పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సహజసిద్ధంగానే తగ్గించుకోవచ్చు.