Lemon Water | వేసవికాలం దాదాపు వచ్చేసిందనే చెప్పవచ్చు. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు దాహాన్ని తీర్చుకోవడానికి శీతల పానీయాలు, సోడాలు వంటి క్యాలరీలు కలిగిన పానీయాలను తాగుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల దాహం తీరినప్పటికీ ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. వీటిలో ఉండే చక్కెరలు, అధిక క్యాలరీలు శరీర బరువు పెరగడానికి కారణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కనుక వీటిని తాగడం మంచిది కాదు. శీతల పానీయాలకు బదులుగా రోజూ నిమ్మకాయ నీటిని తాగడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల దాహం తీరడంతో పాటు శరీరం హైడ్రేటెడ్ గా మారుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. నిమ్మకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
నిమ్మకాయ నీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేసవికాలంలో రోజూ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, అలాగే ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల మనం బరువు తగ్గవచ్చు. భోజనానికి ముందు ఈ నీటిని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. మనం తక్కువ ఆహారాన్ని తీసుకోగలుగుతాం. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం తగ్గుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం మూత్రపిండాల్లో రాళ్లు తయారవ్వకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు మందులు వాడే వారు మందులతో పాటు నిమ్మకాయ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలాగే భోజనానికి ముందు నిమ్మకాయ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీటిని తాగడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శీతల పానీయాలను తాగడం వల్ల దీనిలో ఉండే చక్కెరల కారణంగా దంతక్షయం వచ్చే అవకాశం ఉంది. కానీ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల దంత సమస్యలు తగ్గడంతో పాటు నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో ఈ నీటిని తాగడం వల్ల డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ సమస్యలు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. అలాగే ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, శరీరం ఐరన్ ను గ్రహించడానికి విటమిన్ సి కావాలి. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి అందుతుంది. తద్వారా ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
వేసవికాలంలో చాలా మంది వడదెబ్బ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో నిమ్మకాయ నీటిని తాగడం వల్ల త్వరగా కోలుకుంటారు. డీహైడ్రేషన్ కారణంగా శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి. ఇలా అనేక విధాలుగా నిమ్మకాయ నీరు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక ఈ నీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో లేదా చల్లని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఇందులో పుదీనా, తేనె, మాపుల్ సిరప్, దోసకాయ ముక్కలు, చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు.. ఇలా మనకు నచ్చిన వాటిని జోడించి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే చాలా మంది ఈ నిమ్మకాయ నీటిలో రుచి కోసం చక్కెరను, ఉప్పును అధిక మోతాదులో కలిపి తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యానికి మేలుకు బదులు హాని కలుగుతుంది. కనుక సాధారణ నిమ్మకాయ నీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.