ఆరోగ్యకరమైన పొట్టతోనే బలమైన రోగ నిరోధక వ్యవస్థ సాధ్యం. తిన్న తిండి వంటబడితేనే మెదడు, గుండె.. మొత్తంగా శరీరం దిట్టంగా ఉంటాయి. కాబట్టి, ఏది పడితే అది పొట్టలో తోసుకోకుండా.. జీర్ణవ్యవస్థ క్షేమం కోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకోవాలి. ఫైబర్ సమృద్ధిగా ఉన్నవి, ప్రొబయోటిక్ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. వీటివల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. మొరంగడ్డ (స్వీట్
పొటాటో), పాలకూర, బీట్రూట్, క్యారెట్.. లాంటివి పొట్టకు మంచి చేసే ఫైబర్‌కు గనులు. తాజా పండ్లలోనూ ఫైబర్ అధికం. బాగా మరాడించిన ధాన్యం కాకుండా ముతకగింజలను ఎంచుకోవాలి. యోగర్ట్, పెరుగు లాంటి ప్రొబయోటిక్ పదార్థాలు కూడా పొట్టలో బ్యాక్టీరియాకు మంచి మిత్రులు. అవసరమైన వారికి ప్రొబయోటిక్ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే, వీటిని డాక్టర్ల సూచనల మేరకే వాడాలి.
వ్యాయామం మిగతా శరీరంతోపాటు పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమంతప్పని వ్యాయామం పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెంచుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం చేయని ఊబకాయులతో పోలిస్తే, వ్యాయామం చేసే ఆరోగ్యవంతుల పొట్టలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి, మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం నాణ్యమైన జీవితానికి అత్యవసరమని మరిచిపోవద్దు. ఇక అతిగా మద్యం తాగడం శరీరానికి మాత్రమే కాదు, పొట్టలోని సూక్ష్మజీవులకూ చెరుపు చేస్తుంది.
మద్యం మోతాదు మించితే గుండెలో మంట, అసౌకర్యంగా ఉండటం, అల్సర్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. కాబట్టి, మద్యం మితంగానే తీసుకోవాలి. పొట్ట ఆరోగ్యం మీద ఒత్తిడి ప్రభావం కూడా గణనీయమైందే. మన పరిపూర్ణ ఆరోగ్యం పొట్ట మెదడు అనుసంధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పొట్టను ‘రెండో మెదడు’ అని పిలుస్తారు. మానసిక ఒత్తిడిని దరిచేరనీయకూడదు. మల విసర్జన క్రమంలో మార్పులు, అసాధారణంగా బరువు తగ్గడం, రక్తహీనత, మలద్వారం నుంచి రక్తం పడటం.. పొట్ట అనారోగ్యానికి సంకేతాలు. ఆలస్యం చేయకుండా.. రోగ నిర్ధారణ, చికిత్స కోసం సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ‘చిట్టి నా పొట్ట శ్రీరామ రక్ష’ అని మరిచిపోకూడదు.