Vitamin C Absorption | మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ సి కూడా ఒకటి. దీనిని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. విటమిన్ సి మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో, మనం తీసుకున్న ఆహారంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించేలా చేయడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే విటమిన్ సి ని మన శరీరం తయారు చేయలేదు. అలాగే విటమిన్ సి ని శరీరం నిల్వ ఉంచుకోదు. కనుక మనం ప్రతిరోజూ ఆహారం ద్వారా విటమిన్ సి ని తీసుకోవాల్సిందే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పెద్దలు, మహిళలు రోజూ 75 మిల్లీ గ్రాములు, పురుషులు 90 మిల్లీగ్రాముల విటమిన్ సి ని తీసుకోవాలి. సహజ సిద్దమైన, బలవర్దకమైన ఆహారాల ద్వారా శరీరానికి కావల్సిన విటమిన్ సిని మనం రోజూ తీసుకోవచ్చు.
ప్రతిరోజూ విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, మామిడి, కివి వంటి పండ్లల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నారింజ పండులో 70 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది రోజువారి విటమిన్ సి అవసరాలను తీరుస్తుంది. అలాగే కివిలో దాదాపు 65 మిల్లీ గ్రాములు, ఒక కప్పు స్ట్రాబెర్రీలలో 59 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. మనకు చవకగా లభించే జామకాయలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన విటమిన్ సి ని రెండింతల పరిమాణంలో పొందవచ్చు. పైనాపిల్, మామిడి, బొప్పాయి వంటి పండ్లల్లో కూడా దాదాపు శరీర అవసరాలకు సరిపోయేంత విటమిన్ సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుక ఆహారంలో భాగంగా రోజూ పండ్లను తీసుకోవడం వల్ల విటమిన్ సి లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.
పండ్లు మాత్రమే కాకుండా విటమిన్ సి ఉండే కూరగాయలను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. క్యాప్సికంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 100 గ్రాముల ఆకుపచ్చ క్యాప్సికంలో 16.5 మిల్లీగ్రాములు, పసుపు రంగు క్యాప్సికంలో 159.61 మిల్లీగ్రాములు, ఎరుపు క్యాప్సికంలో 81.19 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 100గ్రాముల బ్రోకలీలో 65 మిల్లీగ్రాములు, 100 గ్రాముల పాలకూరలో 28.1 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. టమాటాలను తీసుకోవడం వల్ల రోజు వారి అవసరాలలో దాదాపు 28 శాతం విటమిన్ సి లభిస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు వాటి పోషక విలువలను పెంచుకోవడానికి విటమిన్ సి తో బలవర్దకపరచబడతాయి. రోజూ తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలతోపాటు కొద్ది మొత్తంలో విటమిన్ సి ని కూడా పొందవచ్చు.
ఇక విటమిన్ సి నీటిలో కరుగుతుంది. వేడికి కూడా సున్నితంగా ఉంటుంది. కనుక మన వంట పద్దతులను మార్చుకోవాలి. సాధ్యమైనప్పుడల్లా పండ్లను, కూరగాయలను పచ్చిగానే తీసుకోవాలి. కూరగాయలను నీటిలో వేసి మరిగించడానికి బదులుగా ఆవిరి మీద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల మనం తీసుకునే ఆహారాల నుండి విటమిన్ సి తొలగిపోకుండా ఉంటుంది. శరీరంలో తగినంత విటమిన్ సి ఉంటేనే మనం తీసుకునే ఆహారాల్లో ఉండే ఐరన్ మన శరీరానికి అందుతుంది. కనుక పాలకూర, కూరగాయలు, బీన్స్ వంటి వాటితో విటమిన్ సి ఉండే ఆహారాలను కలిపి తీసుకోవాలి. సలాడ్, సూప్స్ లలో నిమ్మరసం కలిపి తీసుకోవడం, భోజనంతో నారింజ రసాన్ని తాగడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మన శరీరానికి కావల్సిన విటమిన్ సి ని రోజూ పొందవచ్చు. విటమిన్ సి లోపంతో బాధపడే వారు ఈ పద్దతులను రోజూ పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.