Anemia | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌తోపాటు ఇతర పోషకాలు కూడా మనకు లభించాలి. అప్పుడే ఎలాంటి రోగం రాకుండా ఉంటాం. ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు లేదా మినరల్స్ వల్ల పలు లోపాలు ఏర్పడుతుంటాయి. దీంతో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటిల్లో రక్తహీనత కూడా ఒకటి. రక్తహీనత సాధారణంగా ఐరన్ లోపం వల్ల తలెత్తే సమస్య. ఇది అత్యంత సహజసిద్ధమైంది. చాలా మందికి రక్తహీనత వస్తూనే ఉంటుంది. ఇక స్త్రీలలో అయితే రక్తహీనత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రక్తం తయారు అయ్యేందుకు ఐరన్ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కనుక ఐరన్ ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. ఐరన్ లోపిస్తే రక్త కణాలు తయారు కావు. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. అయితే ఏయే ఆహారాలను తీసుకోవడం వల్ల ఐరన్ లోపం సమస్యను అధిగమించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, పాల ఉత్పత్తులలో విటమిన్ బి12 ఉంటుంది. అలాగే బ్రౌన్ రైస్, పుట్ట గొడుగుల్లో, మటన్, చికెన్, ప్రాన్స్, చేపలు, కోడిగుడ్లలోనూ విటమిన్ బి12 ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు తయారు అయ్యేందుకు సహాయ పడుతుంది. కనుక విటమిన్ బి12 అందేలా చూసుకోవాలి. అంటే.. ఆయా ఆహారాలను తరచూ తింటుండాలి. దీంతో ఎర్ర రక్త కణాలు తయారు అవుతాయి. అలాగే వీటిల్లో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీరంలో రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రోజూ ఆహారంలో పాలకూరను చేర్చుకోవాలి. దీంతో జ్యూస్ తయారు చేసి తాగితే రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. పాలకూరను తినడం వల్ల విటమిన్ కె కూడా లభిస్తుంది. ఇది రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీంతో గాయాలు అయినప్పుడు తీవ్ర రక్త స్రావం జరగకుండా ఆపవచ్చు.
బీట్రూట్ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే తీసుకోవడం వల్ల కూడా శరీరానికి ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. బీట్రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తాన్ని తయారు చేయడంతోపాటు శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ సైతం తగ్గుతాయి. కనుక బీట్రూట్ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే దానిమ్మ పండ్ల రసం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకు ఒక దానిమ్మ పండును తినవచ్చు. లేదా ఒక గ్లాస్ దానిమ్మ పండ్ల జ్యూస్ తాగవచ్చు. ఇందులోనూ ఐరన్ సమృద్ధిగానే ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు తయారయ్యేందుకు దోహదం చేస్తుంది. కనుక రక్తం తక్కువగా ఉన్నవారు దానిమ్మ పండ్లను తింటుండాలి. లేదా జ్యూస్ అయినా తాగవచ్చు.
రోజూ ఉదయాన్నే పరగడుపునే గుప్పెడు కరివేపాకులను తింటుండాలి. వీటిని నేరుగా తినడం ఇష్టంలేనివారు వీటి పొడిని మజ్జిగలో కలిపి కూడా తాగవచ్చు. ఇలా తాగినా కూడా ఐరన్ లభిస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే ఆహారంలో భాగంగా తోటకూర, గోంగూర, చుక్కకూర వంటి ఆకుకూరలను తింటుండాలి. ఇవి కూడా ఐరన్‌ను కలిగి ఉంటాయి. దీంతో రక్తం తయారవుతుంది. రక్తం తయారయ్యేందుకు టమాటాలు కూడా ఎంతగానో పనిచేస్తాయి. రోజూ టమాటా జ్యూస్ తాగవచ్చు. వీటిల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. రోజుకు ఒక యాపిల్‌ను తింటున్నా కూడా ఎర్ర రక్త కణాలు తయారు అయ్యేలా చేయవచ్చు. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా పలు ఆహారాలను తింటే ఐరన్ లోపం సమస్యను అధిగమించవచ్చు. దీంతో రక్త హీనత తగ్గుతుంది.