మనకు విరేచనాలు, జ్వరం లాంటివి తలెత్తినప్పడు సాధారణంగా కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల వచ్చిన రోగాలని పొరబడుతుంటాం. అంతేతప్ప వాటికి మూలం వంటింట్లో పాత్రల్ని కడిగే స్పాంజ్‌గా అనుమానించం. కానీ, స్పాంజ్ మన ఆరోగ్యానికి హాని కలిగించే వివిధ రకాలైన బ్యాక్టీరియాకు నెలవని ఓ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి స్పాంజ్‌ను ఎలా వాడాలో తెలుసుకుని ఉండాలి.
వంటగదిలో ఉండే స్పాంజ్ టాయిలెట్ బౌల్ కంటే ఎక్కువ బ్యాక్టీరియాకు ఆశ్రయంగా ఉంటుందట. అంటే టాయిలెట్ కంటే సూక్ష్మక్రిములతో నిండిపోయిన స్పాంజ్ మన ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుందన్నమాట. అంకెల్లో చెప్పడం కష్టమే కానీ, మనం వాడే స్పాంజ్ మీద ఒక్క ఘనపు సెంటీమీటర్‌కు 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందట. అలా మనం పాత్రల్ని కడిగే ప్రతిసారి స్పాంజ్ మనం వాడే వస్తువుల్ని కలుషితం చేస్తూనే ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ ముప్పును పెంచుతూ ఉంటుంది. పైగా వంటగదిలో వాడే స్పాంజ్లు వాటి నిర్మాణం రీత్యా సహజంగానే సూక్ష్మజీవులు పెంపొందడానికి అనువుగా ఉంటాయని ఆ అధ్యయనం వెల్లడించింది.
కలుషితమైన స్పాంజ్ ఓ మోస్తరు గ్యాస్ట్రో ఎంటరైటిస్తోపాటు మెనింజైటిస్, న్యుమోనియా, తీవ్రమైన జ్వరాలు, రక్త విరేచనాలు, కిడ్నీ సమస్యలు, ప్రాణాంతకంగా పరిణమించే ఫుడ్ పాయిజనింగ్ లాంటి తీవ్రమైన రోగాలకు దారితీయొచ్చు. మనం వండుకునే పదార్థాలను బట్టి స్పాంజ్‌ల మీద కాంపిబ్యాక్టర్, ఎంటరోబ్యాక్టర్ క్లోసే, ఈ.కొలి, క్లెబ్సియెల్లా, మోరాగ్జెల్లా ఓస్లోయెన్సిస్, సాల్మొనెల్లా, స్టెఫలోకోకస్, ఎసినెటోబ్యాక్టర్ తదితర బ్యాక్టీరియాలు పేరుకుపోతాయి.
బ్యాక్టీరియా ముప్పు తగ్గించుకోవాలంటే ఒకే స్పాంజ్‌తో వివిధ రకాలైన పాత్రలను కడగకూడదు. వేర్వేరు వాటిని ఎంచుకోవాలి. అంతేకాకుండా స్పాంజ్‌ను నిల్వ నీటిలో అలానే ఉంచేయకూడదు. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిముల బెడద తగ్గించుకోవడానికి మైక్రోవేవ్‌లో రెండు నిమిషాల పాటు ఉంచాలి. దీంతో దాదాపు 99.9 శాతం బ్యాక్టీరియా నశించిపోతుంది. ఇక పాత్రలు కడిగేటప్పుడు చేతులకు డిష్ గ్లవుజులు వేసుకుంటే మంచిది.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ స్పాంజ్‌లను వాడకూడదు. సెల్యులోజ్ ఆధారిత స్పాంజ్‌లను ఉపయోగించాలి. స్పాంజ్లు వద్దనుకుంటే స్క్రబ్ బ్రష్‌లు, సిలికాన్ బ్రష్‌లు, వేడినీటిలో ముంచి పాత్రల్ని కడగడం, వంటపాత్రల్ని తుడిచేందుకు, కడిగేందుకు వాడే డిష్ ర్యాగ్స్ను (బట్టలు) తరచుగా లాండ్రీకి ఇవ్వడం లాంటివి మంచి ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి.