Fish | మాంసాహారం తినేవారు చాలా మందికి చేపలు అంటే ఇష్టమే. చేపలను తినేవారు సీఫుడ్ ప్రియులు ప్రత్యేకంగా ఉంటారు. చేపలతో ఎలాంటి వంటకాలు చేసినా సరే లాగించేస్తారు. అయితే ఆరోగ్యకరమైన మాంసాహారం ఏది.. అని అడిగితే అందులో చేపలు కచ్చితంగా ముందు వరుసలో నిలుస్తాయని చెప్పవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ చేపలను తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే చేపలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి, వారంలో చేపలను ఎన్ని సార్లు తినవచ్చు. ఎంత మోతాదులో తినాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది నాన్ వెజ్ ప్రియులు తింటున్న ఆహారాల్లో చేపలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లతోపాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక చేపలను తరచూ తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సముద్రపు లేదా మంచినీటి చేపల్లో ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించేందుకు సహాయం చేస్తాయి. రక్తంలో అధికంగా ఉండే ట్రై గ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చేపల్లో ఉండే డీహెచ్ఏ మెదడు, కంటి రెటీనా కణాలను రక్షిస్తుంది. మెదడు ఎదుగుదలకు సహాయం చేస్తుంది. దీని వల్ల వయస్సు మీద పడుతున్నప్పటికీ మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. మతిమరుపు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ రాకుండా చూసుకోవచ్చు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నుంచి బయట పడవచ్చు. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆటోఇమ్యూన్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
చేపల్లో హై క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయి. మన శరీరానికి కావల్సిన 9 ముఖ్యమైన అమైనో యాసిడ్లు చేపల ద్వారా మనకు లభిస్తాయి. ఇవి కండరాల మరమ్మత్తుకు సహాయపడతాయి. కణజాలం వృద్ధి చెందేలా చేస్తాయి. శరీరంలో పలు జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు దోహదం చేస్తాయి. కండరాలు ప్రశాంతంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారికి ఎంతో మేలు జరుగుతుంది. చేపలను తినడం వల్ల విటమిన్ డి మనకు సహజసిద్ధంగా లభిస్తుంది. సాధారణంగా మనకు విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. కానీ విటమిన్ డి లోపం ఉన్నవారు చేపలను తింటుంటే ఆ లోపం నుంచి బయట పడవచ్చు. దీని వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
చేపలను తింటే విటమిన్ బి12 కూడా సహజసిద్ధంగా లభిస్తుంది. చాలా మందికి విటమిన్ బి12 లోపం ఉంటుంది. అలాంటి వారు చేపలను తింటుంటే మేలు జరుగుతుంది. విటమిన్ బి12 వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెడ, భుజాల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గిపోతాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. చేపలను తినడం వల్ల సెలీనియం అధికంగా లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. చేపల్లో ఉండే డీహెచ్ఏ కంటి ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. చేపలు ఆరోగ్యకరమే అయినప్పటికీ మోతాదులోనే తినాలి. వారంలో కనీసం 100 నుంచి 200 గ్రాముల మేర చేపలను తినవచ్చని అమెరికా ఎఫ్డీఏ సూచిస్తోంది. ఇలా చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.