Pistachios | ప్రస్తుతం చాలా మందిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ, అవగాహన పెరిగాయి. అందులో భాగంగానే ఆరోగ్యంగా ఉండేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకునేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం విషయానికి వస్తే ఏది తినాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. లేదా కొందరికి అసలు అలాంటి ఆహారం తినేందుకు టైం లభించడం లేదు అని భావిస్తారు. కానీ రోజుకు కేవలం 5 నిమిషాల సమయం వెచ్చిస్తే చాలు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో పిస్తా పప్పు కూడా ఒకటి. దీన్ని నానబెట్టాల్సిన పనిలేదు. పెనంపై కాస్త వేయించి నిల్వ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త పింక్ సాల్ట్ చల్లి తినవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు లభించడమే కాదు, పోషకాలు కూడా అందుతాయి.
పిస్తాపప్పును రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పప్పును రోజూ తినేందుకు పెద్దగా సమయం పట్టదు. పిస్తాపప్పును రోజుకు 30 గ్రాముల మోతాదులో తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంటే సుమారుగా 20 నుంచి 25 పిస్తాపప్పులను తింటే చాలన్నమాట. ఇది గుప్పెడుకు సమానంగా ఉంటుంది. పిస్తాపప్పును తింటే అనేక పోషకాలు లభిస్తాయి. పిస్తాలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పప్పులో విటమిన్ బి1, విటమిన్ ఇ కూడా అధికంగానే ఉంటాయి. పిస్తా పప్పులో పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్, మెగ్నిషియం, ఐరన్, జింక్ అధికంగా ఉంటాయి. కనుక ఇతర ఏ ఆహారాలను తినకపోయినా రోజూ ఈ పప్పును తింటే చాలు, అనేక పోషకాలను పొందవచ్చు.
పిస్తా పప్పులో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల శాకాహారులకు ఇవి మంచి ఆహారంగా పనిచేస్తాయి. ఈ పప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పిస్తాలలో లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇతర నట్స్‌లో ఉండవు. అలాగే విటమిన్ ఇ, పాలిఫినాల్స్, కెరోటినాయిడ్స్ కూడా అధికంగానే ఉంటాయి. అందువల్ల ఈ పప్పును రోజూ తింటే కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. దీంతో కణాలకు జరిగే నష్టం తగ్గుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి.
పిస్తాపప్పును గుండె ఆరోగ్యానికి చక్కని ఆహారంగా నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పును రోజూ తింటే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. దీని వల్ల హార్ట్ బ్లాక్స్ ఏర్పడవు. గుండె పోటు రాకుండా రక్షిస్తాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. పిస్తా పప్పు గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా ఈ పప్పులను తినవచ్చు. పైగా ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పిస్తా పప్పును తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధికంగా బరువు ఉన్నవారు పిస్తా పప్పును రోజూ తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. బరువును తగ్గించడంలో ఈ పప్పు సహాయం చేస్తుంది. ఇలా పిస్తా పప్పును రోజూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.