Green Tea | ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రస్తుతం చాలా మంది గ్రీన్ టీని సేవిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది గ్రీన్ టీని అధికంగా తాగుతుంటారు. చైనా సంప్రదాయ వైద్యంలోనూ గ్రీన్ టీని తాగమని సూచిస్తుంటారు. గ్రీన్ టీలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల పలు వ్యాధులు సైతం నయమవుతాయి. అయితే గ్రీన్ టీ తాగుతాం, బాగానే ఉంటుంది, కానీ రోజుకు ఎన్ని కప్పులు తాగాలి, ఏ సమయంలో తాగాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీ అనేది ఎవరి ఆరోగ్య స్థితిని బట్టి వారు తాగాల్సి ఉంటుంది. కొందరు ఎక్కువ కప్పులు తాగినా పెద్దగా ప్రభావం ఉండదు. కొందరు ఒక కప్పు కూడా తాగలేకపోతారు. కనుక అలాంటి వారు గ్రీన్ టీకి దూరంగా ఉండడమే మంచిది.
సాధారణంగా ఎవరైనా సరే రోజుకు 1 నుంచి 3 కప్పుల వరకు గ్రీన్ టీని తాగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండె పోటు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పలు అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రోజుకు 3 కప్పుల వరకు గ్రీన్ టీని సేవిస్తుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తేలింది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఒక కప్పు గ్రీన్ టీలో సాధారణంగా 50 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ ఉంటుంది. అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 400 మిల్లీగ్రాములకు మించి కెఫీన్‌ను తీసుకోకూడదు. అంటే 8 కప్పుల వరకు గ్రీన్ టీ తాగవచ్చని అర్థం వస్తుంది. కానీ ఒక వ్యక్తి రోజుకు 8 కప్పుల వరకు గ్రీన్ టీని సేవించలేరు. కనుక 3 కప్పులకు పరిమితం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక గ్రీన్ టీని రోజులో ఏ సమయంలో సేవించాలని కూడా చాలా మంది సందేహిస్తుంటారు. గ్రీన్ టీని ఆహారం తినడానికి 1 గంట ముందు లేదా గంట తరువాత తాగాలి. లేదంటే మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. కనుక బ్రేక్ ఫాస్ట్ చేశాక గంట సేపు ఆగి తాగితే మంచిది. మధ్యాహ్నం లంచ్ అయ్యాక 1 గంట విరామం ఇచ్చి కూడా తాగవచ్చు. రాత్రి పూట మాత్రం సేవించకూడదు. ఇందులో ఉండే కెఫీన్ కారణంగా నిద్ర పట్టదు. రాత్రి పూట గ్రీన్ టీని తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇలా గ్రీన్ టీని తాగితే అనేక లాభాలను పొందవచ్చు. గ్రీన్ టీని తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి గుండె పోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి.
గ్రీన్ టీలో ఉండే కెఫీన్, ఎల్-థియానైన్ అనే అమైనో యాసిడ్ కారణంగా మెదడు ఉత్తేజంగా మారుతుంది. చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నిద్ర మత్తు వదిలిపోతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. గ్రీన్ టీని సేవించడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉంటే రోజూ గ్రీన్ టీని తాగుతుంటే ఫలితం ఉంటుంది. గ్రీన్ టీలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెరిగేలా చేస్తాయి. దీంతో ఎముకలు బలంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. గ్రీన్ టీని సేవించడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా సైతం నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా గ్రీన్ టీతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.