Bananas | ఏడాది పొడవునా మనకు అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి ధర తక్కువ ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను ఎవరైనా సరే కొని తినవచ్చు. అరటి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా రక్షిస్తాయి. అయితే అరటి పండ్లను రోజుకు ఎన్ని తినాలి అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం అరటి పండ్లను రోజుకు 1 లేదా 2 వరకు తినవచ్చు. చిన్నవి అయితే 2, పెద్దది లేదా మీడియం సైజ్ అరటి పండు అయితే ఒకటి తిన్నా సరిపోతుంది. అదే శారీరక శ్రమ లేదా వ్యాయామాం చేసేవారు రోజుకు 2 లేదా 3 అరటి పండ్లను తినవచ్చు. అరటి పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.
అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల మోతాదుకు మించి అరటి పండ్లను తింటే కిడ్నీలపై భారం పడుతుంది. కనుక అరటి పండ్లను మోతాదుకు మించి తినకూడదు. అరటి పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఒక పండులో 14 గ్రాముల వరకు సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. ఒక పండును తింటే 105 క్యాలరీల శక్తి లభిస్తుంది. అరటి పండులో ఉండే ఫైబర్ వల్ల ఈ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. కనుక షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా ఒక పండును నిర్భయంగా తినవచ్చు. కానీ మరీ అధికంగా తింటే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే శరీరంలో క్యాలరీలు కూడా చేరుతాయి. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ పండ్లను మోతాదులోనే తినాలి.
అరటి పండ్లను బెర్రీలు, యాపిల్స్, ద్రాక్ష, నారింజ, బొప్పాయి వంటి పండ్లతో ఫ్రూట్ సలాడ్‌గా చేసుకుని తింటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటి పండ్లలో ఉండే పొటాషియం కారణంగా ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు రోజుకు ఒక అరటి పండును తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. అరటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటి పండ్లు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
అరటి పండ్లలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహద పడుతుంది. రక్తం తక్కువగా ఉన్నవారు రోజుకు ఒక అరటి పండును తింటే ఫలితం ఉంటుంది. విటమిన్ బి6 వల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెటబాలిజం మెరుగు పడుతుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అరటి పండ్లను తింటే మాంగనీస్ అధికంగా లభిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండ్లను మోతాదుకు మించి తింటే బరువు పెరుగుతారు. కానీ రోజుకు ఒకటి తింటే బరువు తగ్గుతారు. ఈ పండ్లను తినడం వల్ల ఫైబర్ అధికంగా లభించి కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా అరటి పండ్లను రోజూ మోతాదులో తింటే అనేక లాభాలను పొందవచ్చు.