Bananas | మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. అరటి పండ్లు ధర కూడా తక్కువగానే ఉంటాయి. కనుక ఎవరైనా ఈ పండ్లను కొని తినవచ్చు. అరటి పండ్లు మనకు అందించే ప్రయోజనాలు అమోఘమనే చెప్పాలి. అనేక పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. అరటి పండ్లలో మాంగనీస్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఒక మీడియం సైజ్ అరటి పండును తింటే మనకు సుమారుగా 105 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలె 27 గ్రాములు, ఫైబర్ 3 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, ప్రోటీన్లు 1 గ్రాము, విటమిన్ సి 10 మిల్లీగ్రాములు, విటమిన్ బి6 0.43 మిల్లీగ్రాములు, పొటాషియం 422 మిల్లీగ్రాములు లభిస్తాయి. అలాగే మాంగనీస్, మెగ్నిషియం కూడా అధిక మొత్తంలో మనకు అరటి పండ్ల ద్వారా లభిస్తాయి. అందువల్ల ఈ పండ్లను పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు.
అరటి పండ్లలో అనేక వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం వారంలో కనీసం 5 సార్లు పండ్లను తింటే తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటారని తేలింది. కనుక అరటి పండ్లను తరచూ తినవచ్చు. అయితే ఈ పండ్లను రోజుకు ఎన్ని తినాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు పరిశోధకులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లను మరీ అతిగా తినకూడదు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు 2 వరకు అరటి పండ్లను మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే బరువు పెరుగుతారని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు రోజుకు 1 అరటి పండును తినవచ్చు. మోతాదుకు మించితే దుష్పరిణామాలు ఎదురవుతాయని అంటున్నారు.
అరటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా అసిడిటీ, మలబద్దకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే అరటి పండ్లను మరీ అతిగా తింటే ఫైబర్ అధికంగా చేరుతుంది కనుక అజీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పొట్టలో గ్యాస్ తయారవుతుంది. కాబట్టి ఈ పండ్లను మోతాదులోనే తినాలి. అలాగే అరటి పండ్లను అధికంగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బక్క పలుచగా ఉండే వారు లేదా వ్యాయామం, శారీరక శ్రమ చేసేవారు అరటి పండ్లను కాస్త ఎక్కువగానే తినవచ్చు. కానీ బరువు ఎక్కువగా ఉన్నవారు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు, బరువు తగ్గాలని చూస్తున్న వారు అరటి పండ్లను అధికంగా తినకూడదు. రోజుకు ఒక పండు కన్నా ఎక్కువగా తినకూడదు.
అరటి పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. నీరసంగా, అలసటగా ఉన్నవారు ఈ పండ్లను 2 వరకు తినవచ్చు. మరీ అతిగా తింటే శరీరంలో అధికంగా క్యాలరీలు చేరుతాయి. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. కానీ అతి నిద్ర సమస్య ఉన్నవారు అరటి పండ్లను తినకూడదు. ఇలా అరటి పండ్లను తినే విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.