Curd | మనం ఆహారంలో భాగంగా తీసుకునే పాల పదార్థాలల్లో పెరుగు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెరుగే ఎంతో కాలంగా మన ఆహారంలో భాగమైపోయిందనే చెప్పవచ్చు. చాలా మందికి పెరుగుతో తిననిదే అసలు భోజనం చేసినట్టుగానే ఉండదు. పెరుగు మన శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మన జీర్ణక్రియకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. మనలో చాలా మంది గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి పెరుగు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ గ్యాస్ లక్షణాలను తగ్గించడమే కాకుండా గ్యాస్ తయారవ్వడానికి గల కారణాలపై కూడా పని చేస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడే వారు పెరుగును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్యులు వివరిస్తున్నారు.
పెరుగులో అధికంగా ఉండే ప్రోబయోటిక్స్ ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ప్రేగుల గుండా సులభంగా కదులుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. తద్వారా ప్రేగుల్లో గ్యాస్ తయారవ్వకుండా ఉంటుంది. పెరుగును తీసుకోవడం వల్ల దీనిలో ఉండే సూక్ష్మజీవులు మంచి బ్యాక్టీరియాను కాపాడతాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ పునరుద్దరించబడుతుంది. పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడడంలో పెరుగు మనకు ఎంతో దోహదపడుతుంది. పెరుగును తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్ తయారవ్వడం తగ్గుతుంది. అంతేకాకుండా పొట్టలో తయారైన గ్యాస్ సులభంగా బయటకు పోతుంది. దీంతో కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి.
సంక్లిష్టమైన ఆహారాలను సులభంగా జీర్ణం చేయడంలో పెరుగు తోడ్పడుతుంది. పెరుగులోని కొన్ని ఎంజైమ్ లు ఆహారాన్ని వేగంగా, సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఈ ఎంజైమ్ లు లాక్టోస్ ను జీర్ణం చేయడంలో సహాయపడతాయి. లాక్టోస్ అసహనం ఉన్నవారు క్రమం తప్పకుండా పెరుగును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పొట్టలో ఆమ్లాలు ఎక్కువగా తయారైనప్పుడు హైపర్ అసిడిటీ సంభవిస్తుంది. దీని కారణంగా ఛాతి, కడుపులో నొప్పి, మంట, వాంతులు, ఆకలి లేకపోవడం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. పెరుగును తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో పీహెచ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. మంట తగ్గడంతో పాటు హైపర్ అసిడిటీ వల్ల వచ్చే లక్షణాలు కూడా తగ్గుతాయి.
సాధారణంగా అతిగా తిన్న తరువాత కొందరిలో గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది. అలాంటి వారు భోజనంతో పాటు పెరుగును తీసుకోవడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ తయారవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా గ్యాస్ సమస్యను తగ్గించడంలో పెరుగు మనకు ఎంతో సహాయపడుతుంది. ఇక పెరుగును ఉదయం పూట అల్పాహారంతో లేదా మధ్యాహ్న భోజనంతో కూడా తీసుకోవచ్చు. అలాగే కఫం, దగ్గు, జలుబు, అలర్జీ వంటి సమస్యలతో బాధపడే వారు రాత్రిపూట పెరుగును తీసుకోకపోవడమే మంచిది. అదేవిధంగా తీవ్రమైన లాక్టోస్ అసహనం ఉన్నవారు కూడా పెరుగును తినకపోవడమే ఉత్తమం.