Honey In Summer | అన్ని కాలాల్లాగే వేసవి కాలంలోనూ మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. ఒక వేళ తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అసిడిటీ, కడుపులో మంట వస్తుంటాయి. ఇవే కాకుండా పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా మనకు వేసవిలోవస్తుంటాయి. అందువల్ల ఈ సీజన్‌కు తగినట్లుగా మనం ఆహారాలను తింటూ ఉండాలి. మనం తినే ఆహారాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షించేవి కూడా అయి ఉండాలి. దీంతో ఓవైపు అనారోగ్య సమస్యలను తప్పించుకుంటూనే మరోవైపు పోషకాలను కూడా పొందవచ్చు. ఇక వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో తేనె కూడా ఒకటి. వేసవిలో మన శరీరం సహజంగానే వేడికి గురవుతుంది. దీని బారి నుంచి తప్పించేందుకే కాక ఈ సీజన్లో తేనెను తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
వేసవి కాలంలో రోజూ తేనెను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. తేనె మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కాస్త తేనె కలిపి తాగితే శరీరంలోని వేడి బయటకు పోయి శరీరం చల్లగా మారుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడవచ్చు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఉదయం ఈ నీళ్లను సేవిస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసట రాదు. నీరసం కూడా ఉండదు. ఇక ఈ సీజన్లో మన శరీరం పొడిబారిపోతుంది. కొందరికి చర్మం ఈ సీజన్లోనే పగులుతుంది. అలాంటి వారు తేనెను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. తేనె చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీంతో చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. పొడిబారదు, పగలదు. తేనెతో ఫేస్ ప్యాక్‌లు కూడా వేసుకోవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి.
రాత్రి పూట మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. అయితే తేనెను తీసుకుంటూ ఉంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. తేనెలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. అందువల్ల తేనెను తీసుకుంటే ఇది మన శరీరంలో సెరొటోనిన్, మెలటోనిన్‌గా మారుతుంది. ఇది నిద్రను ప్రోత్సహించే హార్మోన్. కనుక రాత్రి పూట తేనెను తీసుకుంటే మైండ్ రిలాక్స్ అయి చక్కగా నిద్ర వస్తుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల తేనె మనల్ని బ్యాక్టీరియా, వైరస్ల నుంచి రక్షిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది.
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వాపులు, నొప్పుల నుంచి రక్షిస్తాయి. చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా చూస్తాయి. దీంతో సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి రక్షణ లభిస్తుంది. తేనె వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. కోల్పోయిన ద్రవాను తిరిగి పొందుతుంది. వేసవిలో ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎండ దెబ్బ తగలదు. అలాగే అధిక బరువును తగ్గించడంలోనూ తేనె అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం పరగడుపునే గోరు వెచ్చని నీటిని ఒక గ్లాస్ తీసుకుని అందులో రాస్త తేనె వేసి కలిపి తాగుతుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గొంతు సమస్యలు ఉన్నవారు తరచూ తేనెను తీసుకుంటుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా వేసవిలో తేనెను రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.