Home Remedies With Honey | తేనె మనకు ప్రకృతి సహజసిద్ధంగా అందించిన పదార్థాల్లో ఒకటి. తేనె ఎంత కాలం ఉన్నప్పటికీ పాడై పోదు. ఆయుర్వేదంలోనూ తేనెకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. అనేక ఔషధాల తయారీలో తేనెను ఉపయోగిస్తుంటారు. తేనె వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తేనెను రోజూ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. అయితే తేనె వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలిగినప్పటికీ దీన్ని ఎలా తీసుకుంటే ఏ వ్యాధి నయం అవుతుంది.. అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ వివరాలనే ఇప్పుడు తెలుసుకుందాం. తేనెతో ఎలాంటి రోగాలను ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కాబట్టి తేనెను తీసుకుంటే రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తేనెలో ఉండే సహజసిద్ధమైన చక్కెర మన శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. నీరసంగా, అలసటగా ఉన్నవారు ఒక టీస్పూన్ తేనెను తీసుకుంటే వెంటనే ఉత్సాహం వస్తుంది. చురుగ్గా మారుతారు. యాక్టివ్గా పనిచేస్తారు. గాయాలు, పుండ్లపై తేనెను రాస్తుంటే అవి త్వరగా మానుతాయి. తేనె చర్మాన్ని సంరక్షిస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్ల తయారీలో ఉపయోగిస్తారు. లేదా నేరుగా తేనెను ముఖానికి అప్లై చేయవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. మృదువుగా ఉంటుంది. చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలిపి సేవస్తుంటే ఎలాంటి గొంతు సమస్య అయినా సరే తగ్గుతుంది. గొంతులో గరగర, నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెలో సహజసిద్ధమైన చక్కెరతోపాటు అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, విటమిన్లు ఎ, బి, సి, డి తేనె ద్వారా మనకు లభిస్తాయి. కాబట్టి తేనెను తీసుకుంటే పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. తేనెను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే 100 రకాలకు పైగా వ్యాధులు రావని ఆయుర్వేదం చెబుతోంది. తేనె సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని అంటున్నారు.
దాల్చిన చెక్క పొడిలో కాస్త తేనె కలిపి తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. ఎముకలు బలంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. భోజనం చేసే ముందు దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తీసుకుంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనె, దాల్చిన చెక్క పొడిని సమాన భాగాల్లో తీసుకుని రోజుకు 2 సార్లు భోజనం చేసిన తరువాత తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె కలిపి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. రోజూ ఉదయం పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె కలిపి తాగుతుంటే స్థూలకాయం తగ్గుతుంది. శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఇలా తేనెతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు.