Home Remedies With Curry Leaves | మనం చాలా కాలం నుంచే కరివేపాకును మన వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తూ వస్తున్నాం. కరివేపాకును నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. కానీ వంటల్లో వేసే కరివేపాకును చాలా మంది తినరు. పడేస్తుంటారు. వాస్తవానికి ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో మన శరీరానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కరివేపాకును ఉపయోగించి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. కరివేపాకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మన దేశంతోపాటు శ్రీలంకలోనూ పండుతుంది.
కరివేపాకు కాస్త వగరు, చేదు రుచిని కలిగి ఉంటుంది. కనుకనే చాలా మంది దీన్ని తినేందుకు ఇష్టపడరు. కానీ దీని ఆకులను ఎండబెట్టి పొడి చేసి తినవచ్చు. రోజూ అన్నంలో మొదటి ముద్ద ఒక టీస్పూన్ కరివేపాకు పొడిని కలిపి తింటే చాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకును అనేక కూరలు, చట్నీలు, రైస్‌తో చేసే వంటలు, సూప్స్‌లోనూ వేస్తుంటారు. కరివేపాకు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కరివేపాకుల్లో విటమిన్లు ఎ, బి, సి సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా అధికంగానే ఉంటాయి. కరివేపాకులను రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల మనకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.
కరివేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆకుల్లో విటమిన్లు ఎ, సి ఉంటాయి. అలాగే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో తీవ్రమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. కరివేపాకులను తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కరివేపాకులను తింటే మలబద్దకం, విరేచనాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
షుగర్ ఉన్నవారు కరివేపాకులను తింటే ఎంతో మేలు చేస్తాయి. షుగర్ లెవల్స్‌ను ఈ ఆకులు తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ హైపర్ గ్లైసీమిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల కరివేపాకులను తింటే ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. కరివేపాకులను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కరివేపాకులో కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. కనుక రోజూ ఈ ఆకులను తింటే శరీరంలోని కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. కరివేపాకు, జీలకర్ర పొడి పాలలో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్య తగ్గుతుంది. నీరసం పోతుంది. కూరల్లోనే కాదు, కాలిన, కమిలిన గాయాలకు కూడా కరివేపాకు గుజ్జు రాస్తే నొప్పి, గాయం ఇట్టే తగ్గిపోతాయి. గర్భిణీలకు ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి ఇస్తే వికారం తగ్గుతుంది.
పుల్లని పెరుగులో కొద్దిగా నీరు చేర్చి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ఈ మిశ్రమం వేసవి కాలంలోనే కాదు, ఎప్పుడైనా సరే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు లేదా కారం, మసాలా అధికంగా తిని పొట్టలో అసౌకర్యానికి గురైన వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు. దీంతో సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇలా కరివేపాకు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.