Turmeric | పసుపును ఎంతో పూర్వ కాలం నుంచే భారతీయులు తమ వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. సుమారుగా 3వేల ఏళ్ల కిందటి నుంచే పసుపు వాడకం ఉందని చరిత్ర చెబుతోంది. పసుపును వంటల్లో వేస్తే చక్కని రుచి, రంగు వస్తాయి. పసుపు క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. ఇది క్రిములను నాశనం చేస్తుంది. ఇంకా ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు పసుపులో ఉంటాయి. పసుపును కేవలం వంటి ఇంటి పదార్థంగానే కాక పలు అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. పసుపులో ప్రోటీన్లు, పీచు, నియాసిన్, విటమిన్లు సి, ఇ, కె, సోడియం, పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. పసుపు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది.
పసుపు, జామ ఆకులను కలిపి నూరి మిశ్రమంగా చేసి దాన్ని రాస్తుంటే మొటిమలు తగ్గుతాయి. రాత్రి పూట గోరు వెచ్చని పాలలో కాస్త పసుపు కలిపి రోజూ తాగితే శరీరంలో అధికంగా ఉన్న కఫం కరుగుతుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం పోతుంది. దీని వల్ల శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి సరిగ్గా ఆడుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపును రోజూ పావు టీస్పూన్ మోతాదులో తింటే రక్త శుద్ది జరుగుతుంది. రక్తంలో ఉండే మలినాలు బయటకు పోతాయి. పసుపు, ఉప్పు, సున్నం కలిపి పట్టీలా కట్టు కడుతుంటే నొప్పులు, బెణుకుల నుంచి త్వరగా కోలుకుంటారు.
రాత్రి పూట కాస్త పసుపును నీటిలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే కొలెస్ట్రాల్, షుగర్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. పసుపు కొమ్మును కాస్త దంచి ఆ మిశ్రమాన్ని తలపై పట్టీలా వేస్తుంటే తలనొప్పి తగ్గిపోతుంది. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందువల్ల రోజూ రాత్రి పసుపు కలిపిన పాలను సేవిస్తుంటే అల్జీమర్స్ వ్యాధి తగ్గుతుంది. మతిమరుపు సమస్య నుంచి బయట పడవచ్చు. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. పాలను వేడి చేసి కొద్దిగా పసుపు, మిరియాల పొడి కలిపి తాగుతుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
సువాసనా భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తుంటే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. పసుపును కొద్దిగా నీటిలో కలిపి మెత్తని ముద్దగా చేసి కట్టు కడుతుంటే సెగ గడ్డలు, కురుపులు మెత్తబడి పగిలిపోతాయి. పుండ్లు, గాయాలు మానుతాయి. వేపాకు, పసుపును నూరి ఆ మిశ్రమాన్ని రాస్తుంటే గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. పసుపు కలిపిన నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని వేసి నానబెట్టి ఆ వస్త్రంతో కళ్లను తుడుచుకుంటూ ఉండాలి. దీంతో కళ్లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. సముద్రపు ఉప్పులో కాస్త పసుపు వేసి కలిపి మెత్తని పొడిలా చేసి దాంతో రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా పసుపును అనేక విధాలుగా ఉపయోగించవచ్చు.