Triphala | ఆయుర్వేదంలో త్రిఫలాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలనే త్రిఫలాలు అంటారు. మన దేహంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల్లో ఉండే హెచ్చు తగ్గుల కారణంగానే అనేక వ్యాధులు వస్తుంటాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఈ దోషాలను సమానంగా ఉంచే గుణం త్రిఫలాలకు ఉంది. అందుకనే వీటిని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఫలాలను నేరుగా తీసుకోవచ్చు. లేదా ఈ మూడింటినీ కలిపి పొడి చేసి దాన్ని త్రిఫల చూర్ణంగా కూడా తీసుకోవచ్చు. త్రిఫల చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. త్రిఫల చూర్ణాన్ని రోజూ ఒక టీస్పూన్ మోతాదులో రాత్రి పూట గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. దీంతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు.
త్రిఫల చూర్ణం లివర్‌ను క్లీన్ చేస్తుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీంతో లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. లివర్ వ్యాధులు ఉన్నవారు త్రిఫల చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల నాడీ సంబంధ సమస్యలు సైతం తొలగిపోతాయి. ముఖ్యంగా మెడ, భుజాల నొప్పి ఉన్నవారు ఈ చూర్ణాన్ని తీసుకుంటే ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోవడం సమస్య నుంచి కూడా బయట పడవచ్చు. త్రిఫల చూర్ణాన్ని రోజూ తీసుకుంటే సమస్త పిత్త దోషాలు పోతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పేగుల్లోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి.
త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, గొంతులో గరగర, గొంతులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణాశయంలో నులి పురుగులు ఉన్నవారు ఈ చూర్ణాన్ని తీసుకుంటే పురుగులు నశిస్తాయి. ఈ చూర్ణంలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. త్రిఫల చూర్ణాన్ని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. త్రిఫల చూర్ణాన్ని తింటే జ్వరం తగ్గిపోతుంది. త్వరగా కోలుకుంటారు. జీర్ణాశయం, పేగుల్లో అల్సర్లు ఉన్నవారు ఈ చూర్ణాన్ని వాడితే ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు, గొంతులో కఫం అధికంగా ఉన్నవారు త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే కఫం కరిగిపోతుంది. శ్వాస మార్గాలు క్లియర్ అవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించవచ్చు.
త్రిఫల చూర్ణాన్ని రాత్రి పూట పాలు లేదా నీటితో కలిపి తీసుకోవచ్చు. తేనెతో కలిపి కూడా తినవచ్చు. వైద్యుల సలహాను అనుసరించి ఈ చూర్ణాన్ని వాడితే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. త్రిఫల చూర్ణాన్ని రోజుకు 2 నుంచి 5 గ్రాముల వరకు ఉపయోగించవచ్చు. అయితే కొందరికి ఈ చూర్ణాన్ని తీసుకుంటే మొదటి రెండు మూడు రోజులు విరేచనాలు అయినట్లు ఎక్కువ సార్లు మల విసర్జనకు వెళ్తారు. ఇది సహజమే. కానీ అంతకు మించి ఎక్కువగా సమస్య ఉంటే ఈ చూర్ణాన్ని ఉపయోగించకూడదు. డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే త్రిఫలను వాడుకోవాలి. ఇది కొందరిలో అలర్జీలను కలిగించే అవకాశం కూడా ఉంటుంది. త్రిఫల చూర్ణాన్ని ట్యాబ్లెట్ల రూపంలోనూ విక్రయిస్తున్నారు. డాక్టర్‌ను సంప్రదిస్తే మీ శరీర బరువు, ఆరోగ్య స్థితులకు అనుగుణంగా డాక్టర్ త్రిఫల చూర్ణం లేదా ట్యాబ్లెట్లను సరైన మోతాదులో ఇస్తారు. దీంతో మీకు ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.