Neem Leaves | పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని విషయాలను చెబుతూ వస్తున్నారు. కానీ మనమే వాటిని సరిగ్గా పాటించడం లేదు. వేప చెట్టు లేని ఊర్లో ఉండకూడదు అని అంటుంటారు. అది అక్షరాలా సత్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే వేప చెట్టు మనకు ఆరోగ్య ప్రదాయినిగా పనిచేస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలను ఇది నయం చేస్తుంది. వేప చెట్టుకు చెందిన అన్ని భాగాలు కూడా మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. కనుకనే మన పెద్దలు అలా చెప్పారు. వేప చెట్టు ఆకులు, బెరడు, కాయలు, పుల్లలు, వేర్లు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించి పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఆయుర్వేద ప్రకారం వేప చెట్టులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వేప చెట్టును పలు రకాలుగా ఉపయోగించుకుంటే మనకు వ్యాధులు అన్న మాటే ఉండదు. వేప చెట్టు మనకు ఎలాంటి లాభాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత తరుణంలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. అయితే వేప ఆకులు మొటిమలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. వేపాకులను కొన్ని తీసుకుని నీటిలో మరిగించి ఆ నీటితో ముఖాన్ని మసాజ్ చేసినట్లు కడగాలి. ఒక గంట సేపు అయ్యాక సాధారణ నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖంపై ఉండే దురద, వాపులు తగ్గుతాయి. ఎరుపు దనం తగ్గుతుంది. ముఖం కాంతి వంతంగా మారి మెరుస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది.
వేపాకుల నీళ్లను ఉపయోగించడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి కూడా బయట పడవచ్చు. బ్లాక్ హెడ్స్‌ను తగ్గించడంలోనూ వేపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. శరీరంలో ఏ చోట అయినా సరే చర్మంపై వేడి కురుపులు వచ్చినా, గాయాలు అయినా వాటిని మానేలా చేయడంలో వేపాకుల పేస్ట్ ఎంతగానో పనిచేస్తుంది. రోజూ దీన్ని రాస్తుంటే ఆయా సమస్యలు త్వరగా తగ్గుతాయి. అలాగే పుండ్లను తగ్గించడంలోనూ వేపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. వేపాకుల పేస్ట్‌ను రాసి కట్టు కడుతుంటే పుండ్లకు ఇన్ఫెక్షన్ అవకుండా ఉంటుంది. అలాగే పుండ్లు త్వరగా మానుతాయి. చర్మంపై ఉండే దద్దుర్లను కూడా వేపాకులు తగ్గిస్తాయి. చర్మం కందిపోయినా, దురదలు వచ్చి దద్దుర్లు ఏర్పడినా వేపాకుల పేస్ట్‌ను రాస్తుంటే ఉపశమనం లభిస్తుంది. ఇలా చర్మ సమస్యలకు వేపాకులు అద్భుతంగా పనిచేస్తాయి.
శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా వేపాకుల పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. వేపాకుల పేస్ట్‌ను తరచూ రాస్తుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తగ్గుతుంది. తలలో ఉండే ఇన్ఫెక్షన్ సైతం తగ్గుముఖం పడుతుంది. దీంతో చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. జుట్టులో ఉండే దురద తగ్గుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. తరచూ వేపాకుల పేస్ట్‌ను హెయిర్ ప్యాక్‌లా కూడా వాడుకోవచ్చు. ఇందులో నిమ్మరసం లేదా పెరుగు కలిపితే ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుంది. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే జుట్టు రాలడాన్ని కూడా వేపాకులు తగ్గిస్తాయి. వేపాకుల పేస్ట్‌లో నిమ్మరసం లేదా కొబ్బరినూనె కలిపి జుట్టుకు పట్టించాలి. కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. జుట్టు రాలకుండా ఆపవచ్చు. శిరోజాలు పలుచబడడం తగ్గుతుంది. జుట్టు బలహీనంగా ఉంటే ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతుంది.
వేపాకులతో ఇంట్లో పొగ వేస్తే దోమలు పారిపోతాయి. వేపాకుల మిశ్రమాన్ని ఇంట్లో స్ప్రే చేస్తున్నా కూడా దోమల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే వేప పుల్లలతో వారంలో కనీసం 2 సార్లు దంతాలను తోముకుంటే దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజూ ఉదయం పరగడుపునే వేపాకు చిగుళ్లను తింటుంటే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా వేపాకులతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.