Liquorice | మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. ఇవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కానీ మనకు చాలా మొక్కలు లేదా చెట్ల గురించి తెలియదు. అలాంటి చెట్లలో అతి మధురం కూడా ఒకటి. దీని బెరడు ఎంతో రుచిగా ఉంటుంది. దీని వేర్లను కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో తీయని రుచి కలిగిన మూలిక ఏది.. అని అడిగితే అతి మధురం అని మనకు ఠక్కున గుర్తుకు వస్తుంది. ఇది అనేక ఔషధ విలువలను కలిగి ఉంటుంది. అనేక వ్యాధులను నయం చేసేందుకు అతి మధురం చూర్ణాన్ని ఉపయోగిస్తారు. దీన్ని అతి మధురం బెరడు, వేర్ల నుంచి తయారు చేస్తారు. అతి మధురాన్ని లిక్కరైస్ అని ఇంగ్లిష్‌లో పిలుస్తారు. దీన్నే యష్టి మధు, మధూక పేర్లతోనూ పిలుస్తారు. తియ్యగా ఉంటుంది కనుకనే ఈ మూలికను అలా పిలుస్తారు.
అతి మధురాన్ని హిందీలో ములేటిగా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం గ్లయిసిరైజా గ్లాబ్రా. ఈ మొక్కలో గ్లయిసిరైజిక్ ఆమ్లం, గ్లూకోజ్, సుక్రోజ్, యాస్పిరాజిన్, ఈస్ట్రోజెన్, స్టిరాయిడ్, సుగంధిత తైలం తదితర సమ్మేళనాలు, గుణాలు ఉంటాయి. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అతి మధురంతో ఒక ప్రయోగం చేశారు. అతి మధురం చూర్ణం, గుమ్మడి, గులాబీ పువ్వులు, సోంపు గింజలతో ఒక ఔషధాన్ని తయారు చేసి దానిని ఎలుకలపై ప్రయోగించారు. ఈ ఔషధం జీర్ణాశయంలోని పుండ్లను నయం చేయడమే కాక, ఇతర ఆధునిక ఔషధాలతో కలిపి వాడినప్పుడు అల్సర్లు మానే ప్రక్రియ వేగవంతం అయినట్లు గుర్తించారు. అందువల్ల అల్సర్ సమస్య ఉన్నవారికి అతి మధురం ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
అతి మధురం చూర్ణంలో కాస్త వస చూర్ణం కలిపి దీన్ని పూటకు పావు టీస్పూన్ చొప్పున మూడు పూటలా తగినంత తేనెతో కలిపి తీసుకుంటే ఎలాంటి దగ్గు నుంచి అయినా సరే ఉపశమనం లభిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం పోతుంది. శ్వాసనాళాలు క్లియర్‌గా మారుతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. అతి మధురం, అశ్వగంధ, శొంఠి పొడులను సమానంగా కలిపి అర స్పూన్ నుంచి ఒక టీస్పూన్ వరకు అర కప్పు పాలతో కలిపి సేవిస్తుంటే కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నీరసం, అలసట తగ్గుతాయి. శరీరానికి కొత్త శక్తి వచ్చినట్లు ఫీలవుతారు. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. సోంపు గింజల చూర్ణానికి రెట్టింపు మోతాదులో అతి మధురం, పటిక బెల్లం కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం ఒక స్పూన్ వంతున అర కప్పు నీటిలో కలిపి సేవిస్తే కడుపు ఉబ్బరం తగ్గి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. పుల్లటి త్రేన్పులు తగ్గిపోతాయి.
అతి మధురం చూర్ణాన్ని మూడు పూటలా ఒక స్పూన్ చొప్పున అర కప్పు నీటిలో కలిపి సేవిస్తుంటే అధిక దాహం తగ్గుతుంది. వెక్కిళ్ల నుంచి బయట పడవచ్చు. నోటిపూత నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో మంట సైతం తగ్గిపోతుంది. శరీరంలోని వేడి తగ్గి శరీరం చల్లగా మారుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండ వేడి కారణంగా ఈ డీహైడ్రేషన్ బారిన పడినవారు ఈ చిట్కాను పాటిస్తే మంచిది. దీంతో చర్మంపై వచ్చే దద్దుర్లను సైతం తగ్గించుకోవచ్చు. అర కప్పు పాలలో కాస్త అతి మధురం చూర్ణం కలిపి తీసుకుంటే బాలింతల్లో పాలు బాగా పడతాయి. బియ్యం కడిగిన నీటిలో కాస్త అతి మధురం పొడి వేసి కలిపి తీసుకుంటే నోరు, ముక్కు నుంచి అయ్యే రక్త స్రావం తగ్గిపోతుంది. స్త్రీలలో రుతు సమయంలో కలిగే అధిక రక్త స్రావం తగ్గుతుంది. అతి మధురం పొడిలో కాస్త గోరు వెచ్చని నీటిని కలిపి పేస్ట్‌లా చేసి దాంతో దంతాలను తోముకుంటే దంతాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా అతి మధురంతో అనేక లాభాలను పొందవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు దీన్ని వాడుకోవాలి.