Home Remedies Using Ghee | భారతీయులు ఎంతో పురాతన కాలంగా నెయ్యిని తమ ఆహారంగా ఉపయోగిస్తున్నారు. నెయ్యిని వంటల్లో వేయడమే కాకుండా నేరుగా కూడా తింటుంటారు. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదంలో ఏనాడో చెప్పారు. అనేక రకాల ఔషధాల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తారు. నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఎ, బ్యుటీరిక్ యాసిడ్, ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందించి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఆయుర్వేదంలో నెయ్యిని పలు రకాల చికిత్సల్లోనూ ఉపయోగిస్తారు. అయితే నెయ్యి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుందని చాలా మందికి తెలుసు. కానీ అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు దీన్ని ఎలా వాడాలి, ఏయే చిట్కాల్లో నెయ్యిని ఎలా ఉపయోగించాలి అని చాలా మందికి తెలియదు. నెయ్యిని పలు రకాలుగా ఉపయోగించడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఆయా చిట్కాల్లో నెయ్యిని వాడడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
రోజూ రాత్రి పూట నిద్రకు ముందు ఒక కప్పు గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ నెయ్యి కలిపి తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. నెయ్యిలో ఉండే బ్యుటీరిక్ యాసిడ్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో అజీర్తి తగ్గుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి కూడా నెయ్యి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమస్యలను తగ్గించుకునేందుకు గాను స్వచ్ఛమైన దేశవాళీ ఆవునెయ్యిని తీసుకుని కాస్త వేడి చేయాలి. అనంతరం ఆ నెయ్యిని రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాల్లోనూ వేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. దీని వల్ల ముక్కులో ఉండే కఫం కరిగిపోతుంది. ముక్కు దిబ్బడ, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆస్తమా, సైనస్ వంటి సమస్యలు ఉన్నవారికి కూడా మేలు జరుగుతుంది. అయితే ఈ సమస్యలు మరీ అధికంగా ఉంటే ఈ చిట్కాను ఉదయం కూడా పాటించవచ్చు. ఇలా ఎంతో ఉపశమనం పొందవచ్చు.
పొట్ట దగ్గరి కొవ్వు కరిగి అధిక బరువు తగ్గేందుకు కూడా నెయ్యి పనిచేస్తుంది. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వు కణాలను యాక్టివేట్ చేస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. నెయ్యిలో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇందుకు గాను రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ నెయ్యిని తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. అలాగే షుగర్ ఉన్నవారికి కూడా నెయ్యి మేలు చేస్తుంది. సాధారణంగా షుగర్ ఉన్నవారు అన్నంకు బదులుగా గోధుమ రొట్టెలను లేదా చిరుధాన్యాలను తింటుంటారు. అయితే వాటికి తోడు నెయ్యిని వాడాలి. దీని వల్ల ఆయా ఆహారాలకు చెందిన గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తగ్గుతుంది. దీంతో ఆయా ఆహారాలు మన శరీరంలో వెంటనే గ్లూకోజ్‌గా మారవు. కాస్త సమయం పడుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ విధంగా నెయ్యిని ఉపయోగించి లాభం పొందవచ్చు.
చర్మ సంరక్షణకు కూడా నెయ్యి ఎంతగానో పనిచేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి మెరిసేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇందుకు గాను ఫేస్ ప్యాక్‌ను తయారు చేసి వాడాల్సి ఉంటుంది. నెయ్యిలో కాస్త శనగపిండి, పసుపు, తగినన్ని నీళ్లు పోసి కలిపి మెత్తని పేస్ట్‌లా మార్చి ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖం కాంతివంతంగా మారి అందంగా కనిపిస్తారు. అలాగే శిరోజాలకు కూడా నెయ్యి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిలో ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు రాసి 20 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే అన్ని రకాల శిరోజాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా నెయ్యితో ఆయా చిట్కాలను పాటించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.