Betel Leaves | తమలపాకు అంటే సహజంగానే చాలా మంది పాన్ అని భావిస్తారు. అది నిజమే అయినా ఈ ఆకులను ఆరోగ్యకరమైన ఆహారాలతో తినాలి. అనారోగ్యకరమైన పొగాకు వంటి వాటితో కలిపి తింటే ఎలాంటి లాభం ఉండదు. తమలపాకులు ఆయుర్వేద పరంగా ఎన్నో అద్భుతమైన గుణాలను కలిగి ఉంటాయి. మనకు కలిగే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. శుభ కార్యాల సమయంలో తప్పకుండా తమలపాకులను ఉపయోగిస్తుంటారు. తమలపాకులకు హిందూ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఈ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. భోజనం చేశాక ఒక తమలపాకును నేరుగా అలాగే నమిలి తింటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
తమలపాకులను నమలడం వల్ల అన్ని జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది.ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకుల్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గర్భిణీలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదలకు సహాయం చేస్తుంది. విటమిన్ ఎ కూడా ఈ ఆకుల్లో అధికంగానే ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరిచి కంటి సమస్యలను పోగొడుతుంది. ఈ ఆకుల్లో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలు డ్యామేజ్ అవకుండా రక్షించుకోవచ్చు. క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
తమలపాకులకు ఆహారాలను పాడవకుండా చూసే గుణం ఉంటుంది. నువ్వుల నూనె, ఆవనూనె, పొద్దు తిరుగుడు నూనె, వేరుశెనగ నూనె వంటివి పాడవకుండా ఉండాలంటే ఒక తమలపాకును వేయాలి. తమలపాకుల్లో చెవికాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ పెరుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల తమలపాకులను తింటే సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తాయి. రోగాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తాయి. రోజూ భోజనం చేసిన అనంతరం ఒక పూట ఒక తమలపాకులో కొన్ని మిరియాలు పెట్టి అలాగే నమిలి తింటుంటే స్థూలకాయం తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. వేపాకులు, తమలపాకులను కలిపి మెత్తగా నూరి చర్మంపై లేపనంలా చేస్తుంటే సమస్త చర్మ రోగాలు తగ్గుతాయి.
తమలపాకుల రసంలో తులసి ఆకుల రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనె కలిపి నాకిస్తుంటే పిల్లల్లో దగ్గు, జలుబు తగ్గిపోతాయి. తమలపాకుల రసాన్ని పాలలో కలిపి తాగితే మహిళల్లో వచ్చే క్షణికావేశం తగ్గుతుంది. తమలపాకుల రసాన్ని రెండు కళ్లలోనూ చుక్కల్లా వేస్తుండాలి. దీంతో కంటి చూపు పెరుగుతుంది. రేచీకటి తగ్గుతుంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఈ చిట్కాను పాటించాలి. తమలపాకులను రోజూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కఫం పోతుంది. తమలపాకులను కాస్త వేడి చేసి స్తనాలపై వేసి కట్టులా కడుతుంటే స్తనాల్లో ఏర్పడ్డ పాలగడ్డలు కరిగిపోతాయి. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకులను కాస్త వేడి చేసి ఆముదం రాసి ఛాతి మీద వేసి కడుతుంటే పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు త్వరగా తగ్గుతాయి. ఇలా తమలపాకులను అనేక రకాలుగా ఉపయోగించి లాభాలను పొందవచ్చు.