Holy Basil Leaves | సాధారణంగా చాలా మంది ఇండ్లలో తులసి చెట్టు ఉంటుంది. హిందువులు తులసి చెట్టును పవిత్రంగా భావించి పూజలు కూడా చేస్తుంటారు. అయితే ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్స్‌గా పిలుస్తారు. ఈ మొక్క ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. పలు ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడంలోనూ తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసి ఆకులను 2 లేదా 3 తీసుకుని రోజూ ఉదయం పరగడుపునే నమిలి తింటుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తులసి ఆకుల్లో అడాప్టొజెనిక్ గుణాలు ఉంటాయి. అంటే ఈ ఆకులను తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
తులసి ఆకుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి అధికంగా ఉంటుంది. యూజినాల్ అనే సమ్మేళనం కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల తులసి ఆకులు యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులను తింటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, రోగాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి సైతం త్వరగా కోలుకుంటారు. తులసి ఆకులతో తయారు చేసే ఔషధాలను శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు సైతం ఉపయోగిస్తున్నారు. ఈ ఆకులను తింటే గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి సరిగ్గా లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి.
తులసి ఆకులను పరగడుపునే తింటుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ ఆకులను తినడం వల్ల పలు జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. దీంతో అజీర్తి ఏర్పడదు. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులను తినడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పోతాయి. ముఖ్యంగా జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలను శరీరం సులభంగా బయటకు పంపిస్తుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఈ ఆకులను పరగడుపునే తింటుంటే మలబద్దకం తగ్గుతుంది. షుగర్ ఉన్నవారికి తులసి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే సమ్మేళనాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేలా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఈ ఆకులను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్న కారణంగా గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కొలస్ట్రాల్ లెవల్స్ తగ్గేలా చేస్తాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. తులసి ఆకులను నోట్లో వేసుకుని బాగా నమిలి తింటుంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గిపోతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా ఆరోగ్యంగా మారుతాయి. తులసి ఆకులను తింటుంటే వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. చర్మం పునరుత్తేజం చెందుతుంది. చర్మం కాంతివంతంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా తులసి ఆకులను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు.