High Cholesterol Symptoms | శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు ఎక్కువైతే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడుతాయి. ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో ఉంటే హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది. అప్పుడు ప్రాణాలు పోతాయి. ప్రస్తుతం చాలా మంది ఈ రకంగానే ఎక్కువగా చనిపోతున్నారు. హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నా చాలా మంది మాత్రం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్లే వాటి బారిన పడుతున్నారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే శరీరం మనకు కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. ఇవి అందరిలోనూ కనిపించకపోవచ్చు. కానీ కొలెస్ట్రాల్ మరీ ఎక్కువైతే మాత్రం అందరిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని పరిశీలించి ముందుగానే జాగ్రత్త పడితే హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉంటే కణాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరి రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో కణాలకు రక్తం చేరదు. ఆక్సిజన్ లభించదు. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీన్నే atherosclerosis అని కూడా అంటారు. చిన్నపాటి వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినా, కొన్ని సార్లు ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా కూడా కొందరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలా గనుక ఎవరికైనా జరుగుతుంటే వెంటనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటేనే ఈ లక్షణం కనిపిస్తుంది. కనుక ఈ లక్షణం కనిపించిన వెంటనే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. లేదంటే హార్ట్ ఎటాక్ బారిన పడతారు.
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి జీర్ణ సమస్యల కారణంగా కూడా ఇలా జరుగుతుంది. అయితే నిరంతరాయంగా ఈ సమస్యలు గనక ఉంటే కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయేమోనని అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఇక కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే చేతులు, కాళ్లు చల్లగా ఉంటాయి. చేతులు, కాళ్లలో రక్త సరఫరా సరిగ్గా జరగదు. కనుక ఆయా భాగాల్లో చల్లగా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే పాదాల్లో అయ్యే గాయాలు లేదా పుండ్లు త్వరగా మానవు. ఆ భాగంలో రక్త సరఫరా సరిగ్గా జరగదు కనుక గాయాలు లేదా పుండ్లు మానేందుకు చాలా సమయం పడుతుంది. ఈ లక్షణం ఎవరిలో అయినా ఉన్నా కూడా దాన్ని అధిక కొలెస్ట్రాల్‌గా అనుమానించాల్సిందే. వెంటనే డాక్టర్‌ను కలిసి కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలితే వెంటనే డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్‌ను ముందుగానే అడ్డుకోవచ్చు. ప్రాణాలను కాపాడుకోవచ్చు.