High Cholesterol Symptoms In Legs | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. చాలా మంది గుండె జబ్బుల బారిన పడి లక్షణాలు తెలియక, నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అస్తవ్యస్తమైన జీవన విధానం, అధిక ఒత్తిడి కూడా గుండె పోటు వచ్చేందుకు కారణం అవుతున్నాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకుల కారణంగా గుండెపై భారం పడుతుంది. దీంతో గుండె పనితీరు మందగిస్తుంది. చివరకు గుండె పోటు వస్తుంది. కానీ ప్రస్తుతం తరుణంలో గుండె పోటు వచ్చిందంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. కనుక ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా చేరకుండా చూడాలి. ఇది అధికంగా ఉంటే మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనించడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. దీంతో గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్డీఎల్ అంటారు. ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. శరీరంలో ఎల్డీఎల్ స్థాయిలు మోతాదుకు మించి ఉంటే అప్పుడు రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో గుండె పోటు వస్తుంది. కొలెస్ట్రాల్ మరీ ఎక్కువగా ఉంటే శరీరం మనకు పలు సంకేతాలను తెలియజేస్తుంది. మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే కాళ్లలో సూదుల్తో గుచ్చినట్లు ఉంటున్నా లేదంటే కాళ్లలో స్పర్శ లేకపోవడం అనిపిస్తున్నా.. మీ శరీరంలో రక్త సరఫరా తగ్గిందని, కొలెస్ట్రాల్ అధికంగా ఉందని అర్థం చేసుకోవాలి. కొలెస్ట్రాల్ నిల్వలు పేరుకుపోతే ఈ సూచనలు కనిపిస్తాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే పాదాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీంతో పాదాల్లో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఈ క్రమంలో ఆ భాగంలో ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. ఈ సూచన కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడాన్ని తెలియజేస్తుంది. ఈ లక్షణం కనిపించినా అనుమానించాల్సిందే. అలాగే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారి పాదాలు వాపులకు లోనవుతాయి. పాదాల్లో నీరు అధికంగా చేరుతుంది. పాదాలపై వేలితో ప్రెస్ చేస్తే చర్మం లోపలికి పోయి సొట్ట పడుతుంది. ఈ లక్షణం కూడా అధిక కొలెస్ట్రాల్ ఉండడాన్ని తెలియజేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు పేరుకుపోతే కాళ్లలో రక్త సరఫరా సరిగ్గా జరగక పోషకాలు కూడా లభించవు. దీంతో రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోతుంటాయి. ఇలా పలు లక్షణాలు కాళ్లలో కనిపిస్తే వాటిని అధిక కొలెస్ట్రాల్ సమస్యగా భావించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని పాటిస్తే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. రోజూ వేళకు భోజనం చేయడం, రాత్రి పూట త్వరగా నిద్రించడం, త్వరగా భోజనం చేయడం, రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా ఉండడం వంటి సూచనలు పాటిస్తే అధిక కొలెస్ట్రాల్ అన్నది ఉండదు. శరీరంలోని ఎల్డీఎల్ మొత్తం తగ్గిపోతుంది. హెచ్‌డీఎల్ పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. పైన తెలిపిన లక్షణాలు అన్నీ వాటంతట అవే తగ్గిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు.