Pulses | పప్పు దినుసులను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. పప్పు దినుసులతో రోజూ రకరకాల కూరలు లేదా వంటకాలను చేస్తుంటారు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలా మనకు అనేక రకాల పప్పు దినుసులు అందుబాటులో ఉన్నాయి. అయితే పోషకాహార నిపుణులు పప్పు దినుసులను పోషకాలకు గనిగా చెబుతుంటారు. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు పప్పు దినుసుల్లో ఉంటాయి. వీటిని తినడం వల్ల క్యాలరీలు పెద్దగా లభించవు. కానీ పోషకాలు అనేకం లభిస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్లను పెద్ద ఎత్తున పొందవచ్చు. ఇవి మనకు శక్తిని అందిస్తాయి. పప్పు దినుసుల్లో ప్రోటీన్లతోపాటు ఫైబర్, జింక్, ఐరన్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు లభిస్తాయి. కనుక పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే పప్పు దినుసులను పోషకాహార నిపుణులు సూచించినట్లు తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
పప్పు దినుసులను కొందరు డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తింటారు. ఇలా అసలు తినకూడదు. వీటిని వేర్వేరుగా తినాల్సి ఉంటుంది. అలాగే కనీసం గంట గ్యాప్ ఇచ్చి తింటే మంచిది. లేదంటే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. పైగా గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. అలాగే పప్పు దినుసులను నానబెట్టి తింటే అధిక మొత్తంలో పోషకాలు లభిస్తాయి. సోయా జాతికి చెందిన గింజలను అయితే మొలకెత్తించి తింటే మంచిది. పప్పు దినుసులను అన్నంతో అయితే 1/3వ వంతు తినాల్సి ఉంటుంది. అంటే తినే అన్నంలో పప్పు దినుసులు 33 శాతం మేర ఉండాలి. దీని వల్ల అధిక మొత్తంలో పోషకాలను పొందవచ్చు. అలాగే షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇక చిరు ధాన్యాలతో పప్పు దినుసులను తింటే రెండింటినీ సమాన భాగాల్లో కలిపి తినాలి. అంటే చిరు ధాన్యాలను ఎంత తింటే పప్పు దినుసులను కూడా అంతే మొత్తంలో తినాలన్నమాట. ఈ విధంగా పప్సు దినుసులను తింటే పోషకాలను సరిగ్గా పొందవచ్చు.
ఒక పప్పు దినుసులను ప్రతి రోజూ తిన్నా వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ చాలా మంది రోజూ పప్పేనా అని పెదవి విరుస్తారు. వాస్తవానికి మన శరీరానికి పప్పు దినుసులు ఎంతో మేలు చేస్తాయి. కనీసం వారంలో 5 రోజులు అయినా సరే పప్పు దినుసులను తింటే మంచిది. భిన్న రకాల పప్పు దినుసులను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. పప్పు దినుసులను రోజూ కూరగానే కాక ఒకసారి ఉడకబెట్టి, ఒకసారి మొలకలుగా, ఒకసారి సలాడ్ రూపంలో తినాలి. దీని వల్ల పప్పు దినుసులను రోజూ తింటున్నామన్న భావన కలగదు. ఇలా తింటే జీర్ణాశయంపై కూడా ఒత్తిడి పడదు. పైగా జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పప్పు దినుసులను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. అనేక రకాల విటమిన్లు, మినరల్స్‌ను పొందవచ్చు. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. అనేక లాభాలను అందిస్తాయి. పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. పప్పు దినుసుల్లో అనేక రకాల ఫైటో కెమికల్స్, సాపోనిన్స్, టానిన్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. పప్పు దినుసులను రోజూ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. అలాగే అధిక బరువును సైతం తగ్గించుకోవచ్చు. ఇలా పప్పు దినుసులను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.