Breastfeeding | కడుపులో ఉన్నప్పుడే కాదు, పుట్టాక కూడా పాపాయికి ప్రాణాధారం అమ్మే. ఆమె చనుబాలు బిడ్డ జీవితకాలానికి సరిపడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. చంటిపాప ఆకలి తీర్చే ఆ అమృతధార గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. అయితే పాపాయికి సరిపడా పాలు రావాలన్నా, తల్లీ బిడ్డల ఆరోగ్యంతో పాటు అనుబంధమూ గట్టిగా ఉండాలన్నా.. చనుబాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు సీనియర్ గైనకాలజిస్టు డా. పి. బాలాంబ (ఆగస్టు తొలివారం తల్లిపాల వారోత్సవం).
అమ్మపాలు అమృతధార అనే మాట అక్షరాలా నిజమని అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే, ఆ ఫలాన్ని బిడ్డకు పరిపూర్ణంగా అందించాలంటే గర్భధారణ సమయం నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం ముందుగా నిపల్ టెస్ట్ చేస్తారు డాక్టర్లు. అంటే, తల్లి చనుమొనలు బిడ్డ పాలు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చూస్తారు. కొంతమందికి ఇన్వర్టెడ్ నిపల్ లేదా ఫ్లాట్ నిపల్ ఉంటాయి. అంటే చనుమొనలు లోపలికి చొచ్చుకుపోయినట్టుగానో, రొమ్ము భాగానికి సమానంగానో ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో బిడ్డ పాలు తాగేందుకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి, తల్లికి ఇలాంటి చనుమొనలు ఉన్నప్పుడు.. సిరంజ్ సాయంతోనో, ఇతర పద్ధతుల్లోనో సరిచేస్తారు. దీనివల్ల, తీరా ప్రసవం అయ్యాక బాలింతరాలు బిడ్డకు పాలిచ్చేందుకు కంగారు పడక్కర్లేదు. కడుపుతో ఉన్నప్పటి నుంచే తల్లిని పాలు పట్టేందుకు మానసికంగా సిద్ధం చేయడమూ ప్రధానమే.
నాలుగు చుక్కలు చాలు
ప్రసవం తర్వాత తొలి మూడు రోజులూ అతికొద్దిగా పాలు వస్తాయి. వాటిని కొలెస్ట్రమ్గా పిలుస్తారు. ఇందులో పోషకాలు పుష్కలం. కొవ్వులు కూడా అధికం. బిడ్డకు అత్యవసరమైన పోషకాలు అందించడమే కాదు, రోగ నిరోధక వ్యవస్థనూ పటిష్టం చేస్తాయి. కానీ, కొంచెమే వస్తున్నాయి కాబట్టి తల్లికి పాలు పడలేదని భావిస్తారు చాలామంది. ఇది తప్పు. అక్కడితో ఆగకుండా.. బిడ్డకు పోతపాలు కూడా పడతారు. ఆ అవసరం ఏమాత్రం లేదు. బిడ్డ ఏడ్చినప్పుడల్లా రొమ్ము నోటికి అందిస్తుంటే కూడా కొంచెం కొంచెంగా పాలు వస్తాయి. ఆ చిన్ని పొట్టకు అధిక కొవ్వులుండే నాలుగు చుక్కల పాలు చక్కగా సరిపోతాయి. లేదూ వేరేపాలు పట్టాలనుకుంటే ఉగ్గుగిన్నె మేలు. ఎందుకంటే, బాటిల్ నుంచి సులభంగా బిడ్డకు అందుతాయి. అదే తల్లి దగ్గర అయితే చనుమొన పట్టుకొని పాలను జుర్రుకోవాల్సి వస్తుంది. తొలి రోజుల్లోనే డబ్బా పాలు అలవాటు చేస్తే.. పసిపిల్లలు తల్లి పాలు తాగడాన్ని కష్టంగా భావించి రొమ్ము పట్టుకునే ప్రయత్నం చేయరు. అందులోనూ బిడ్డ రొమ్ము చీకుతున్నప్పుడు, తల్లి మెదడులో ప్రేరణ జరిగి పాల ఉత్పత్తి మొదలవుతుంది. కాబట్టి, పాలు వచ్చినా రాకపోయినా రొమ్ము అందించడం మాత్రం ఆపేయకూడదు.
ఇలా అయితే మేలు
తమ బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదో అని చాలామంది తల్లులు కంగారు పడుతుంటారు. దానికి ఒకటే గుర్తు. బిడ్డ రోజుకు మూడుసార్లు విరేచనం చేసుకుంటున్నదా లేదా అన్నది చూడాలి. రెండోది వయసుకు తగ్గట్టు బరువు పెరుగుతున్నదా లేదా అన్నదీ గమనించాలి. ఈ రెండూ సరిగ్గా ఉంటే, సరిపడా పాలు అందుతున్నట్టే. అలాగే, కడుపు నిండిందో లేదో అని బిడ్డకు అరగంట సేపు ఒకే రొమ్ము ఇచ్చి కూర్చోవద్దు. ఐదు నిమిషాలకోసారి రొమ్ము మారుస్తూ ఉంటే, పాలు చక్కగా దొరుకుతాయి.
ప్రొ బయాటిక్ బంధం..
పాపాయి పుట్టిన తర్వాత కనీసం ఆరునెలలు అచ్చంగా అమ్మపాలే అందించాలి. ఈ సమయంలో బిడ్డకు మంచినీళ్లు కూడా పట్టాల్సిన పన్లేదు. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రసవ సెలవుల్ని ఆరునెలలుగా ప్రకటించింది. ఆ తర్వాత కాస్త వేరే ఆహారం అందిస్తూ రెండేండ్లపాటు చనుబాలు పట్టొచ్చు. ఎదుగుదలకు కావలసిన సమస్త పోషకాలు దొరకడమే కాదు, పొట్టకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా కూడా వీటి ద్వారా బిడ్డకు చేరుతుంది. అంటే, అమ్మపాలు ప్రొ బయాటిక్ అన్నమాట! అలాగే దగ్గరికి తీసుకుని పాలివ్వడం వల్ల శరీరం వెచ్చగా తగిలి బిడ్డకు సౌకర్యంగా, హాయిగా ఉంటుంది. అలాగే తల్లి మెదడులో లవ్ హార్మోన్గా పిలిచే ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్యా బలమైన ప్రేమబంధం ఏర్పడుతుంది. అంతేకాదు, పాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి.
ఇంకో విషయం ఏమిటంటే.. కేవలం తల్లిపాల మీదే పాపాయి ఆధారపడినన్ని రోజులూ ప్రత్యేకంగా గర్భ నిరోధకాలు వాడాల్సిన అవసరం ఉండదు. అచ్చంగా తల్లిపాలు… అంటే రోజుకు కనీసం ఎనిమిది సార్లు బిడ్డకు పాలు పట్టాలి. ఈ సమయంలో విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ కారణంగా అండం విడుదల ఆలస్యమవడం వల్ల పాలివ్వడం అన్నది సహజ గర్భనిరోధకంగా ఉపయోగపడుతుంది. అయితే ఇది మొదటి ఆరు నెలలకే పరిమితం. చనుబాలివ్వడం వల్ల ఉపయోగాల మీద అవగాహన పెంచుకుంటే తల్లీబిడ్డలిద్దరూ మరింత ఆరోగ్యంగా ఉంటారన్నదే ఈ తల్లిపాల వారోత్సవాల ఉద్దేశం.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి