శరీరాన్ని కుదురుగా నిలబెట్టేవి పాదాలే అయినా, మన బరువును మోసేది మాత్రం మడమలే. వాటికి నొప్పి పుడితే అడుగులు వేయడం కూడా కష్టం అవుతుంది. దీంతో, మన దినచర్య నెమ్మదిస్తుంది. చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి.
పాదం మనిషికి ఆధారం. ఎంతదూరం నడిస్తే అంత జీవితానుభవం సంపాదించినట్టు లెక్క. ఆ జ్ఞానానికే మనం పాదాభివందనం చేస్తాం. మనతో అడుగులు వేయించే పాదాలకు కనుక నొప్పి వస్తే, బతుకు నరకమే అవుతుంది. ఈ అసౌకర్యానికి అనేక కారణాలు..
1. మడమలను, కాలివేళ్ల ఎముకలను కలిపే పట్టీలో వాపు-ప్లాంటార్ ఫసైటిస్.
2. పాదాల్లో మడమ భాగంలో ఎముక పెరగడం వల్ల తలెత్తే- హీల్ స్పర్స్.
3. కాలు, మడమ ఎముకల కండరాలను కలిపే పట్టీకి గాయం కావడం వల్ల వచ్చే-అకిలీస్ టెండనైటిస్.
4. మడమల్లో నరాలు కుంచించుకుపోవడం-నర్వ్ కంప్రెషన్.
5. మడమల ఎముకల్లో పగుళ్లు-స్ట్రెస్ ఫ్రాక్చర్ ఆఫ్ హీల్ బోన్.
చాలాసార్లు మడమ నొప్పికి అసలు కారణాలు తెలియవు. కాకపోతే కొన్ని సమస్యలను ఈ నొప్పికి దారితీసేవిగా అనుమానించవచ్చు (అఫెండర్స్). అవి…
1. అధిక బరువు.
2. అరికాళ్ల మధ్య ఖాళీ లేకుండా పాదం పూర్తిగా నేలకు ఆనడం (ఫ్లాట్ ఫీట్) లేదా ఆ ఖాళీ మరీ ఎక్కువగా ఉండటం (హై ఆర్చెస్).
3. పాదాలకు అనువుగా లేని షూస్ ధరించడం.
4. నడవడం, పరిగెత్తడం మూలంగా పాదాల మీద ఎక్కువ ఒత్తిడిపడటం (ఎక్సెసివ్ అనక్కస్టమ్డ్ స్ట్రెయిన్).
5. కీళ్లనొప్పులు, నరాల సమస్యలు, మధుమేహం, అధిక యూరికామ్లం లాంటి ఆరోగ్యపరమైన కారణాలు.
మడమల నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు. కొంత అవగాహన, సంరక్షణతో పాదాల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి అలానే వేధిస్తుంటే మాత్రం.. చికిత్స కోసం డాక్టర్ను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక నొప్పి వెంటాడుతుంది. నడవటం కూడా కష్టం అవుతుంది.