Healthy Breakfast | రోజూ సాధారణంగా చాలా మంది మూడు సార్లు ఆహారం తీసుకుంటుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ చేస్తారు. రాత్రి డిన్నర్ చేస్తారు. అయితే ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ను అతి ముఖ్యమైనదిగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే సుమారుగా 10 నుంచి 14 గంటల పాటు ఆహారం లేకుండా ఉన్న శరీరం ఆహారం కోసం అన్వేషిస్తుంది. శక్తి కోసం చూస్తుంది. అందుకని మనం ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ అత్యంత శక్తివంతమైంది, పోషకాలతో నిండినది అయి ఉండాలని డాక్టర్లు సైతం చెబుతుంటారు. కనుకనే బ్రేక్‌ఫాస్ట్‌కు చాలా మంది అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు కొందరు అనారోగ్యకరమైన ఆహారాలను తింటుంటారు. వాస్తవానికి ఇలా చేస్తే బ్రేక్ ఫాస్ట్ చేసిన ఫలితం కూడా ఉండదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో కొన్ని రకాల ఆహారాలను తీసుకోకూడదని డాక్టర్లు చెబుతున్నారు.
చాలా మంది ఉదయం సిరియల్స్ను తింటుంటారు. కార్న్ ఫ్లేక్స్‌లో పాలు పోసుకుని తింటుంటారు. వాస్తవానికి ఇవి ప్రాసెస్ చేయబడిన ఆహారాలు. చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కనుక ఉదయం వీటిని తినడం మంచిది కాదు. సాధారణ బ్రేక్‌ఫాస్ట్‌కు బదులుగా వీటిని తింటే మనకు క్యాలరీలు అధికంగా లభిస్తాయి. అలాగే శరీరంలో చక్కెర ఎక్కువగా చేరుతుంది. దీని వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే శరీరం ఇంకా ఇలాంటి ఆహారం కోసం చూస్తుంది. ఫలితంగా రోజులో ఇతర భాగంలో ఎక్కువ ఆహారాన్ని తింటారు. దీని వల్ల పెద్ద ఎత్తున క్యాలరీలు పేరుకుపోతాయి. ఫలితంగా అధిక బరువు పెరుగుతారు. కాబట్టి ఉదయం సిరియల్స్ను తినకూడదు.
కొందరు ఉదయం కొవ్వు పదార్థాలను అధికంగా తింటారు. ఇలా తినడం కూడా మంచిది కాదు. కొవ్వు పదార్థాలు మన శరీరానికి మంచిదే. కానీ ఉదయం మోతాదులోనే తినాలి. అతిగా తింటే బరువు పెరుగుతామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చాలా మంది ఉదయం వైట్ బ్రెడ్ తింటారు. ఇందులోనూ క్యాలరీలు అధికంగానే ఉంటాయి. వీటిని తిన్నా కూడా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అధికంగా బరువు పెరుగుతారు. కాబట్టి ఉదయం వైట్ బ్రెడ్‌ను తినడం మంచిది కాదు. అలాగే ఇతర ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, కొవ్వు పదార్థాలను కూడా ఉదయం తినకూడదు. ఇవన్నీ బరువును పెంచుతాయి. డయాబెటిస్ వచ్చేలా చేస్తాయి. కాబట్టి వీటిని ఉదయం తినకూడదు.
ఇక ఉదయం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటే మంచిది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓట్స్, క్వినోవా, మిల్లెట్స్ ఉప్మా వంటివి తినాలి. అలాగే కోడిగుడ్లను కూడా తీసుకోవచ్చు. వీటి ద్వారా మనకు ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి మనకు శక్తిని అందిస్తాయి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట ఉండవు. అలాగే పెరుగు వంటి ప్రొబయోటిక్ ఆహారాలను తినాలి. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం, అసిడిటీ ఏర్పడవు. అదేవిధంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడోలను తినవచ్చు. వీటిల్లో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను కూడా తినవచ్చు. ఇవన్నీ ఫైబర్‌ను అందిస్తాయి. మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.