మయోనైజ్.. ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఆహార పదార్థం. కొన్నాళ్లుగా దీనివాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, గుడ్డుతో తయారు చేసే ఈ మయోనైజ్‌ను తరచుగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుడ్డు సొన, నూనె, వెనిగర్/నిమ్మరసంతో దీనిని తయారు చేస్తారు. పచ్చిగుడ్డులో ఉండే ‘సాల్మోనెల్లా బ్యాక్టీరియా’ వల్ల.. మయోనైజ్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. అంతేకాదు.. ఇందులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి.. జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇక అలర్జిక్ రియాక్షన్లు సరేసరి. మయోనైజ్ పడనివారికి ఒంటిపై దద్దుర్లు వస్తాయి. ఇందులో ఎక్కువగా సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ కారకాలు ఉంటాయి. మయోనైజ్ ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి.. గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. కేలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మయోనైజ్‌ను తరచుగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాకుండా.. ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇక, మయోనైజ్‌ను సరిగ్గా నిల్వ చేయకుంటే.. మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే, మయోనైజ్ వాడకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. మయోనైజ్‌కు బదులుగా గ్రీక్ యోగర్ట్, ఇంట్లో తయారు చేసుకొనే హమ్మస్ లాంటివి వాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. వీటివల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.