ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో.. మధుమేహం ముందు వరుసలో ఉన్నది. వయసు, లింగభేదం లేకుండా ఈ వ్యాధి అందర్నీ ఇబ్బంది పెడుతున్నది. అయితే.. గర్భిణుల్లో షుగర్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్నదని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెస్టేషనల్ డయాబెటిస్.. తల్లితోపాటు బిడ్డకూ హాని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే.. ఆరోగ్యవంతమైన, పండంటి బిడ్డలకు జన్మనివ్వొచ్చని చెబుతున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. గర్భిణుల్లో ఇన్సులిన్‌కు ప్రతికూల హార్మోన్లు (కార్టిసోల్), మాయకు సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయట. ఫలితంగా ఇన్సులిన్ సామర్థ్యం తగ్గి.. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయట. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. తల్లికి ఇబ్బంది కలగడంతోపాటు పిండం ఎదుగుదల మీదా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ముదిరితే.. పిండం అవయవాల తయారీ మందగిస్తుందనీ, పుట్టిన తర్వాత గుండె, ఊపిరితిత్తుల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందనీ చెబుతున్నారు. దీనినుంచి బయటపడాలంటే.. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, ఆహారం విషయంలో నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు రక్తంలో గ్లూకోజ్ మోతాదును పరీక్షించుకుంటూ.. వైద్యుల సలహామేరకు మందులు వాడాలని అంటున్నారు.