తలనొప్పి మొదలుకొని తీవ్రమైన సమస్యల వరకు.. అన్ని రుగ్మతలకూ ఓ మందుబిళ్ల పరిష్కరంగా కనిపిస్తుంది. కానీ చటుక్కున మింగేసే మందుబిళ్ల పనితీరు కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుందట. అది మన పొట్టలోకి వెళ్లాలి. పని మొదలుపెట్టాలి. ఇక్కడ అనేక విషయాలు ప్రభావం చూపిస్తాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, పొట్ట నిండుగా ఉండటం.. తదితర అంశాలు మందు తీరును మారుస్తాయి. అంతేకాదు! ఔషధం తీసుకున్న సమయంలో పేగుల కదలికలు, ఆ వ్యక్తి నిలబడిన భంగిమ కూడా ప్రభావం చూపిస్తాయట. ప్రయోగశాలలో జీర్ణాశయ నమూనా మీద పరిశోధన జరిపి మరీ తేల్చిన విషయమిది. ఈ కోణంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. వాటి ఫలితాలు కూడా వస్తే… ఇకనుంచి ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిన సమయాన్ని, ఆ ఘడియలో రోగి శారీరక స్థితి తదితర విషయాలను గమనించుకోవాలి. అంతేకాదు! పనిచేస్తున్నప్పుడు తీసుకునే మందులకూ, పడుకుని ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ట్యాబ్లెట్ల
మోతాదుకూ తేడా ఉండాలి.
భూతాపం పెరిగిపోతున్నది. ఎవరిని నిందించినా, ఎవరు బాధ్యత నుంచి తప్పుకొన్నా… ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న మాట మాత్రం వాస్తవం. దీనివల్ల పంటల దగ్గర్నుంచి అన్నిటి మీదా ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ విభ్రాంతికరమైన పరిశోధన వెలుగులోకి వచ్చింది. భూతాపం వల్ల పగటికంటే రాత్రి ఉష్ణోగ్రతలలోనే ఎక్కువ మార్పు వస్తుందట. ఈ శతాబ్దం చివరినాటికి ఇవి దాదాపుగా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని చాపల్ హిల్ అనే పరిశోధకుడు తేల్చాడు. రాత్రివేళ ఉష్ణోగ్రతలు పెరగడంతో మన జీవక్రియలు
(మెటబాలిజం) తీవ్రంగా దెబ్బతినే ప్రమాదమూ ఉంది. దాంతో మానసిక సమస్యల నుంచి గుండెజబ్బుల వరకూ ఎన్నో సమస్యలు రావచ్చు. దీనివల్ల మరణాల సంఖ్య 60 శాతం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
మన మెదడుపై సంగీత ప్రభావం మీద చాలా పరిశోధనలే జరిగాయి. సంగీతంతో నొప్పిని తగ్గించవచ్చనే వాదనలూ వినిపించాయి. వీటిలో నిజానిజాలు తెలుసుకోవాలని అనుకున్నారు పరిశోధకులు. దీనికోసం నొప్పితో బాధపడుతున్న ఎలుకలకు సంగీతాన్ని వినిపించారు. అవి సంగీతం వింటున్నప్పుడు వాటి మెదడులో జరుగుతున్న చర్యలను గమనించేందుకు… ఫ్లోరోసెంట్ కాంతిని వెదజల్లే ప్రొటీన్లను ఎక్కించారు. ఆశ్చర్యంగా శ్రావ్యమైన ధ్వనులను వినిపించినప్పుడు, వాటి నొప్పి తీవ్రత తగ్గడాన్ని గమనించారు. ఎలుకల మీదే ఇంతలా ఉంటే.. సంక్లిష్టమైన ఉద్వేగాలు ఉండే మనుషుల మీద మరింత ప్రభావం ఉండవచ్చని ఊహిస్తున్నారు.
శరీరంలో కణజాలం దెబ్బతినప్పుడు… దాన్ని బాగుచేసేందుకు రక్షణ చర్యలు మొదలవుతాయి. ఇవి వాపునకు (ఇన్ఫ్లమేషన్) దారితీస్తాయి. అయితే ఈ వాపు అనవసరంగా ఏర్పడినప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండెజబ్బుల నుంచి ఆస్తమా వరకూ ఈ ఇన్ ఫ్లమేషనే కారణం. ఇది మధుమేహం లాంటి ఎన్నో సమస్యలకు కూడా దారితీస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి వైద్యులు అనేక మార్గాలు సూచిస్తూనే ఉన్నారు. జీవనశైలి నుంచి పోషకాహారం వరకూ వివిధ ఉపాయాలు చెబుతూనే ఉన్నారు. తాజాగా… విటమిన్-డితో ఈ సమస్యను అధిగమించవచ్చని నిరూపించారు దక్షిణ ఆస్ట్రేలియా పరిశోధకులు. మన శరీరంలో ఎక్కడైనా వాపు ఉన్నప్పుడు కాలేయం సి-రియాక్టివ్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తిచేస్తుంది. విటమిన్-డి తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటాన్ని గమనించారు. ఇకనుంచీ విటమిన్‌కు తగినంత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అన్నమాట!