ఎముకల బలానికి..
వయసు, కుటుంబ చరిత్ర, పోషక విలువల లోపం, వ్యాయామం లేకపోవడం.. ఆస్టియోపొరోసిస్‌కు అనేక కారణాలు. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళలనే ఎక్కువగా వేధిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారంతో ఈ ఇబ్బందిని అధిగమించే మార్గం ఉందని నిపుణులు భరోసా ఇస్తున్నారు. పాల ఉత్పత్తులలో పాలు, పెరుగు, చీజ్‌లోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. ఆకుకూరల్లో.. పాలకూర, తోటకూర, గోంగూర మొదలైనవి క్యాల్షియం, విటమిన్-కె, మెగ్నీషియం అందిస్తాయి. చేపల్లో.. సాల్మన్ మొదలైనవి విటమిన్-డి, ఒమేగా-త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ను ఇస్తాయి. గింజలు-విత్తనాల విషయానికొస్తే.. ఆల్మండ్స్, చియా సీడ్స్, ఆవగింజలు.. క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ను ప్రసాదిస్తాయి. ఇవేకాదు, క్యాల్షియం, విటమిన్-డి జోడించిన వివిధ ఆహార పదార్థాలనూ తీసుకోవచ్చు.
ఆరోగ్యానికి కమ్మని మార్గం
ఆహార పదార్థాల మీద ఉప్పు బదులుగా ఆరోగ్యకరమైన మూలికలు, మసాలాలు (స్పైసెస్) చిలకరించుకుంటే మంచిదట. దీనివల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ‘జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు తమ ఆహారంలో అల్లం, రోజ్మేరీ, తులసి, దాల్చిన చెక్క లాంటి 24 రకాల మూలికలు, సుగంధద్రవ్యాలు జోడించుకున్నారు. ఇలా ఏ కొద్దిమొత్తంలో ప్రయత్నించినా సరే నాలుగు వారాల్లో వారి జీర్ణవ్యవస్థలో వివిధ రకాలైన మంచి సూక్ష్మజీవులు పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి మన ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తాయట.
ఇక ఆహారం వృథా కాదు
ఏటా మనం తినే తిండిలో దాదాపు మూడోవంతు వృథా అవుతున్నది. పోలాండ్‌కు చెందిన రీబ్రెడ్ అనే స్టార్టప్ దీన్ని అరికట్టాలని నిర్ణయించుకున్నది. మీజ్ రాక్ అనే బేకరీ వ్యవస్థాపకులు కొవిడ్ మహమ్మారి సమయంలో తమ దగ్గర వివిధ రకాల బ్రెడ్లు అమ్ముడు పోకుండా మిగిలిపోవడం గమనించారు. వీటితో ‘ఒకోవిటా’ అనే ఆల్కహాలిక్ స్పిరిట్ (మద్యం) తయారుచేశారు. దీన్ని పోలాండ్ వ్యాప్తంగా అమ్మకానికి ఉంచారు. ఈ ఆవిష్కరణ స్ఫూర్తిగా రీబ్రెడ్ సంస్థ వృథాగా మిగిలిన ఆహారాన్ని వివిధ రకాలుగా ఉపయోగంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నది. వీటితో భూమిలో కలిసిపోయే ప్యాకేజింగ్ సామగ్రి, 3డీ ప్రింటింగ్‌లో వాడే మెటీరియల్ మొదలైనవి తయారు చేస్తున్నారు.