డోపమైన్ అలసటను నిర్ణయిస్తుంది
డోపమైన్ మెదడులో ఉత్పత్తయ్యే రసాయనం. ఇది మనలో ఉల్లాసాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. పనుల్లో రాణించేలా చేస్తుంది. ప్రశంసలకు అర్హులను చేస్తుంది. అయితే, కొందరిని ఉదాసీనంగా వ్యవహరించేలానూ చేస్తుంది. మతిమరుపునకు సంబంధించిన పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ)తో బాధపడుతున్నవారి మీద జాన్ హాప్కిన్స్ మెడిసిన్ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కాలక్రమంలో మెదడులో డోపమైన్‌ను ఉత్పత్తి చేసే కణాలు నశించిపోవడంతో పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. పార్కిన్సన్స్తోపాటు కుంగుబాటుకు సంబంధించిన అలసట, వ్యాయామం మొదలైన వాటిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి తాజా అధ్యయనం ఉపకరిస్తుంది.
అభిమానానికి హద్దులేమిటి?
మనలో చాలామందికి సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రసిద్ధ క్రీడాకారుల పట్ల ఎనలేని అభిమానం ఉంటుంది. ఇది కనుక మితి మీరితే సమస్యగా మారుతుంది. వ్యక్తులలో అభిమానం హద్దులు మీరుతున్న తీరును గుర్తించడానికి హ్యూస్టన్‌కు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కొన్ని లక్షణాలను సూచించింది. సెలెబ్రిటీ గురించి ఎవరైనా ‘వాస్తవాల’ను వెల్లడిస్తున్నప్పుడు.. మన మనసుకు ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మనసుకు నచ్చజెప్పుకోవాలి. ఆ సెలెబ్రిటీ నడవడికలో ఏదో సమస్య ఉందని తెలుసుకోవాలి. వాళ్లూ మనుషులే కదా! ఇక మనకు ఇష్టమైన ప్రముఖుల గురించి గంటల కొద్దీ చర్చోపచర్చల పేరుతో వృథా చేసుకుంటాం. కానీ, అదే సెలెబ్రిటీలు కొన్నిసార్లు చెత్త సినిమాలతోనో, చెత్త స్కోర్తోనో మనల్ని నిరుత్సాహపరుస్తారు. ఇలాంటి సమయాల్లో మనం ఇతరుల మీద విరుచుకుపడటం లాంటివీ చేస్తుంటాం. లేదంటే మనమీద మనకు ఏవగింపు కూడా కలగవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే… వాటిని మన అభిమాన పరిమితులకు సూచనలుగా భావించాలని అధ్యయనం స్పష్టం చేసింది.
మేలుచేసే ఆలివ్ వాటర్
మనకు ఆలివ్ నూనె తెలుసు. ఆలివ్ వాటర్ గురించి తెలియదు. ఆలివ్ ఆయిల్ తయారీలో వచ్చే ఉప ఉత్పత్తే ఆలివ్ వాటర్. దీనిని వృథాగా పారబోస్తారు. కానీ, ఇందులో మనకు మేలుచేసే గుణాలు ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ పోషకాహార నిపుణులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ తరహా అధ్యయనాల్లో ఇదే మొదటిది. ఆలివ్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన పాలిఫినాల్స్, ఫినాలిక్ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి వయసు మీదపడకుండా, శరీరం ఇన్ఫ్లమేషన్కు గురికాకుండా చూస్తాయి. కొందరిలో శ్వాస వ్యవస్థ పనితీరును, ఆక్సిజన్ స్థాయులను ఆలివ్ వాటర్ మెరుగుపరిచిందని అధ్యయనం వెల్లడించింది.