Dry Fish | చేపలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. అందులో భాగంగానే చాలా మంది తమ ఇష్టానికి తగినట్లుగా చేపలను తింటుంటారు. అయితే చేపల్లో రెండు రకాలు ఉంటాయి. అవి పచ్చి చేపలు, ఎండు చేపలు. పచ్చి చేపలను తినే మాదిరిగానే చాలా మంది ఎండు చేపలను కూడా తింటుంటారు. అయితే ఎండు చేపలను తినవచ్చా.. ఇవి మన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయా.. అసలు వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు చేపలను సాధారణంగా ఉప్పు కలిపి ఎండలో ఎండబెట్టి తయారు చేస్తారు. కొందరు వేయించుకుని కూడా నిల్వ ఉంచుకుంటారు. ఇలా చాలా మంది ఎండు చేపలను తింటారు. చేపలను ఎండ బెట్టడం వల్ల వాటిల్లో ఉండే నీరు పోతుంది. కానీ వాటిల్లో ఉండే పోషకాలు మాత్రం అలాగే ఉంటాయి. ఈ క్రమంలో ఎండు చేపలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
ఎండు చేపల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తింటే హై క్వాలిటీ ప్రోటీన్లను పొందవచ్చు. ఎండు చేపల్లో నీరు ఉండదు కనుక ప్రోటీన్ల పరిమాణం పెరుగుతుంది. పచ్చి చేపల కన్నా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు ఎండు చేపల్లోనే ఉంటాయి. ప్రోటీన్ల వల్ల కండరాలు మరమ్మత్తులకు గురవుతాయి. కణజాలం వృద్ధి చెందుతుంది. శరీరంలో వివిధ రకాల జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. అలాగే ఈ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు యాక్టివ్‌గా పనిచేసేలా చేస్తాయి. దీంతో చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట ఉండవు. మెదడులో ఉండే వాపులు సైతం తగ్గిపోతాయి. దీంతోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
చేపలను ఎండబెట్టడం వల్ల వాటి ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక ఆ ఎముకలను సైతం నమిలి తినేయవచ్చు. దీంతో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఫాస్ఫరస్‌ను కూడా పొందవచ్చు. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎండు చేపల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎండు చేపల్లో ఉండే హై క్వాలిటీ ప్రోటీన్లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీని వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నవారు నాన్ వెజ్ ప్రియులు అయితే తరచూ ఎండు చేపలను తింటే మేలు జరుగుతుంది.
ఎండు చేపలను ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సిన పనిలేదు. ఎన్ని రోజుల పాటు అయినా సరే నిల్వ ఉంటాయి. వాటిలో ఉప్పు అధికంగా ఉంటుంది కనుక త్వరగా పాడవవు. తాజా చేపలను తరచూ కొని తెచ్చుకోలేకపోతే ఎండు చేపలను ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే చాలు, ఎన్ని రోజుల పాటు అయినా వాడుకోవచ్చు. ఎండు చేపల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న మాట వాస్తవమే అయినప్పటికీ వీటిని తినే వారు మాత్రం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే.. ఈ చేపల్లో ఉండే ఉప్పు కారణంగా వీటిల్లో సోడియం స్థాయిలు అధికంగా ఉంటాయి. కనుక హైబీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు వీటిని తినాల్సి ఉంటుంది. అలాగే ఎండు చేపలను ఎక్కడ కొంటున్నాం అనేది కూడా ముఖ్యమే. శుభ్రత లేనిచోట వాటిని కొంటే వాటిల్లో క్రిములు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి చేపలను తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక శుభ్రంగా ఉన్న ఎండు చేపలనే కొనాలి. ఇలా ఎండు చేపలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.