Green Apple | మనం బయటకు వెళ్తే మార్కెట్లో అనేక రకాల పండ్లు మనకు దర్శనమిస్తుంటాయి. అయితే కొన్ని రకాల పండ్లు చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉన్నాయి. కానీ వాటిని మనం అంతగా పట్టించుకోము. అలాంటి పండ్లలో గ్రీన్ యాపిల్స్ ఒకటి. యాపిల్ పండ్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ యాపిల్స్‌నే అందరూ తింటారు. గ్రీన్ యాపిల్స్‌ను చాలా తక్కువ మంది తింటారు. అయితే ఎరుపు రంగు యాపిల్ పండ్లలాగే గ్రీన్ యాపిల్ పండ్లు కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గ్రీన్ యాపిల్ పండ్లను తినడం వల్ల అనేక పోషకాలతోపాటు ఆరోగ్య పరంగా అనేక లాభాలను కూడా పొందవచ్చు. కనుకనే రోజుకు ఒక గ్రీన్ యాపిల్ పండును అయినా సరే తినాలని డాక్టర్లు చెబుతున్నారు.
గ్రీన్ యాపిల్ పండ్లు ఎంతో రుచిగా ఉండడమే కాదు అనేక పోషకాలను కూడా కలిగి ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే మనకు తాజాగా అనిపిస్తుంది. అలాగే ఆహారంలో కూడా ఇవి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఒక గ్రీన్ యాపిల్ పండులో సుమారుగా 0.44 గ్రాముల ప్రోటీన్లు, 20.8 గ్రాముల ఫైబర్, 5 మిల్లీగ్రాముల క్యాల్షియం, 0.15 మిల్లీగ్రాముల ఐరన్, 5 మిల్లీగ్రాముల మెగ్నిషియం, 12 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 0.04 మిల్లీగ్రాముల జింక్, 25 గ్రాముల పిండి పదార్థాలు, 8.4 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి.
గ్రీన్ యాపిల్ పండ్లలో విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్ట వాపు కూడా తగ్గుతుంది. గ్రీన్ యాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా, శరీరం వాపులకు గురి కాకుండా చూస్తాయి.
గ్రీన్ యాపిల్ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు గ్రీన్ యాపిల్ పండ్లను తింటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి కూడా ఈ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ ఈ పండ్లను తింటే బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా క్యాలరీలు ఎక్కువగా చేరవు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది.
గ్రీన్ యాపిల్ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే శరీరానికి నీరు లభిస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో గ్రీన్ యాపిల్స్ ఎంతగానో దోహదపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల సహజసిద్ధమైన మౌత్ వాష్ గా పనిచేస్తాయి. దీంతో దంతాలు, చిగుళ్లు దృఢంగా మారడమే కాదు, నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇలా గ్రీన్ యాపిల్ పండును రోజుకు ఒకటి తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.