Palm Jaggery Health Benefits | కొల్లాపూర్ రూరల్, ఫిబ్రవరి 18: నిత్యం తాటి బెల్లం ఆహారంలో భాగంగా తీసుకుంటే అమృతంగా పనిచేస్తుందని, సర్వరోగాలను తాటి బెల్లం నివారిస్తుందని పలువురు ఆరోగ్యనిపుణులు అంటున్నారు. తాటి బెల్లం తినడం వల్ల పలు ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా అజీర్తితోపాటు క్యాన్సర్ కారకాలను శరీరం నుంచి బయటకు పంపించడం లో ఈ బెల్లం దోహదపడుతుంది. పేగులో పేరుకుపోయిన పలు రోగకారకాలను తొలగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రోజూ భోజనం అనంతరం తాటి బెల్లం ముక్కను తింటారు.
కరోనా కల్లోలం తర్వాత ప్రతిఒక్కరూ వారి ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ చూపడం మొదలుపెట్టారు. కరోనా లాంటి వైరస్ల బారిన పడకుండా పోరాడాలంటే తప్పనిసరిగా రోగనిరోధకశక్తి అధికంగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నా రు. అందువల్ల చాలామంది పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
ఈ క్రమంలో పూర్తిగా రసాయనాలతో పండించిన పంటను పక్కన పెట్టి ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న చక్కెరకు ప్రత్యామ్నాయం తాటిబెల్లమేనని నిపుణులు చెబుతున్నారు. తాటిబెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. చక్కెరకంటే 60రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగిన తాటిబెల్లం అనేక ఆరోగ్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఖనిజాలతోపాటు అనేక విటమిన్లు ఇమిడి ఉన్నాయి.
తాటిబెల్లం పేగులను శుభ్రపర్చడానికి దోహదపడుతుంది. అలాగే రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్స్థాయిని పెంచుతుంది. ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం, నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం, పోటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. మహిళల్లో బహిష్టు సమస్యలను అరికడుతుంది. తాటిబెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తశుద్ధి చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడిని తొలగిస్తుంది. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటుంది. తాటిబెల్లం తింటే నీరసం రాదు. శరీరానికి ఎక్కువశక్తిని అందిస్తుంది. ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్స్ మలబద్దకం, అజీర్తి చికిత్సకు సహాయపడతాయి. శరీరంలో హానికారక టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. నిత్యం తాటిబెల్లం తీసుకోవడం వల్ల శరీర పుష్టి, వీర్యవృద్ధి కలుగుతుందని వైదులు సూచిస్తున్నారు.
తాటిబెల్లం తినడం వల్ల శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, పేగులు, ఆహారగొట్టం, ఊపిరితిత్తులు, చిన్నపేగు, పెద్దపేగులో ఉండే విషపదార్థాలను బయటికి పంపించి పేగు కాన్సర్ రాకుండా చేస్తుంది. వాస్తవానికి ఇది పొడి దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయాన్నే తాటిబెల్లం తింటే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీటిలో తాటిబెల్లం కలుపుకొని తాగడం వల్ల జలుబు, దగ్గు నివారించబడుతుంది. మైగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది. అధిక బరువును తగ్గించడంలో, బీపీని కంట్రోల్ చేయడంలో ఉపకరిస్తుంది. ముఖ్యంగా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తాటిబెల్లం తినడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నప్పుడు నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.