మునగ చెట్టు.. ఔషధాల గని. ఆయుర్వేదంలోనూ తిరుగులేనిది. మునగకాయలు, ఆకులేకాదు.. మునగ పువ్వుల్లోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ‘మునగపూల టీ’తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని అంటున్నారు. మునగపూలలో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా.. శరీరానికి విటమిన్ ఎ, బి1, బి2, బి3, సితో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా అందుతాయి.
ముందుగా మునగపూలను కోసి.. వాటిని బాగా జల్లెడ పట్టించాలి. ఆ తర్వాత ఎండలో బాగా ఆరబెట్టి.. పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ మునగపూల పొడిని కలిపి.. బాగా మరిగించాలి. అంతే! ‘మునగపూల టీ’ సిద్ధమైపోయినట్లే! దీన్ని నేరుగా అయినా.. రుచి కోసం ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని అయినా తాగొచ్చు.