భారతీయ ఆహారంలో తరచుగా వాడే టమాటాలు, ఎంతో ఇష్టంగా తినే తర్బూజ (పుచ్చ) పండ్లలో లైకోపీన్ అనే సహజమైన పిగ్మెంట్ ఉంటుంది. ఇది కుంగుబాటు (డిప్రెషన్) లక్షణాలను తగ్గిస్తుందని ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ తాజా అధ్యయనం తెలిపింది. వైద్యపరంగా ఇచ్చే యాంటి డిప్రెసెంట్స్‌తో పోలిస్తే ప్రకృతి సిద్ధంగా దొరికే లైకోపీన్‌తో కుంగుబాటు నుంచి రక్షణ ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. మొక్కల్లో సహజంగా లభించే లైకోపీన్లో శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్, నాడీవ్యవస్థను రక్షించే న్యూరోప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. ఇక పరిశోధకులు తమ అధ్యయనం కోసం ఎలుకలను ఎంచుకున్నారు. లైకోపీన్ సహజంగా కెరాటినాయిడ్లలో దొరుకుతుంది.
యాంటి ఆక్సిడెంట్ అయిన లైకోపీన్ పండ్లకు ఎరుపు, గులాబి రంగులను ఇస్తుంది. ఇక లైకోపీన్ అత్యధికంగా టమాటాల్లో దొరుకుతుంది. వీటితోపాటు తర్బూజ, గులాబీ ద్రాక్షపండ్లు, జామ, పొప్పడి పండ్లలోనూ సమృద్ధిగా ఉంటుంది. ఎర్ర క్యాప్సికమ్ (రెడ్ బెల్‌పెప్పర్)లో కూడా కొద్దిమొత్తంలో లభిస్తుంది. కాగా లైకోపీన్ కొవ్వుల్లో కరిగిపోతుంది. ఆలివ్ నూనె, అవకాడో నూనె, పల్లీలు లాంటి గింజల నుంచి తీసిన నూనెల నుంచి లభించే ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకుంటే ఇది బాగా వంటబడుతుంది. అన్నట్టు టమాటాలతో చేసిన వంటలు, సూప్‌లు, సాస్‌లు లైకోపీన్‌కు మంచి వనరులు.