Health Tips | సాధారణంగా ఇంట్లో పిల్లలకు పాలు తాగించేందుకు ప్లాస్టిక్ బాటిల్స్‌ను వాడుతుంటారు. వాటితో నష్టాలుంటాయని తెలిసినా.. చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్‌ని వాడుతున్నారు. మహిళలు బాటిల్స్ వేడి నీటితో కడుతూ మళ్లీ మళ్లీ వాడుతూ వస్తుంటారు. అయితే, ఇలా ప్లాస్టిక్ బాటిల్స్‌ని వాడడం వల్ల చిన్నారులకు హాని కలుగుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం పిల్లల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. అయినా చాలామంది ఈ సూచనను పెడచెవిన పెడుతున్నారు. ఈ సీసాల వాడకంతో శరీరంలో మైక్రోప్లాస్టిక్ పరిమాణం పెరగడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఆరోగ్య నిపుణులు పిల్లల్లో ఐక్యూ స్థాయిని ప్రభావితం చేస్తున్నట్లుగా గుర్తించారు. బాటిల్‌ను క్రమం తప్పకుండా.. సరిగా శుభ్రం చేయకపోతే ఆరోగ్యాన్ని సైతం ప్రభావిస్తుం చేస్తుందని.. పిల్లలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని.. అలాగే పలు రకాలుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలిపారు.
స్వీడన్‌లోని కార్ల్‌స్టాడ్ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ హెల్త్ సెన్సెస్ ప్రొఫెసర్ గుస్టాఫ్ బోర్న్హాగ్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసేందుకు ఉపయోగించే బిస్ఫెనాల్ ఎఫ్ అనే రసాయనం శరీరంలో అనేక మార్పులు కారణమవుతుందన్నారు. పిల్లల్లో మానసిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఈ రసాయనాలు నాడీ సంబంధిత అభివృద్ధికి ముఖ్యమైన జన్యువులలో మార్పులకు కారణమవుతాయని అధ్యయనాలు గుర్తించాయి. పిండం దశలో రసాయనం బారినపడడం వల్ల ఏడు సంవత్సరాల వయసులోనే పిల్లల ఐక్యూ స్థాయి తగ్గుతుందని తేలింది. ప్రొఫెసర్ కార్ల్ గుస్టాఫ్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ బాటిల్‌ను శుభ్రం చేయడానికి వేడి నీటిలో ఉంచినా లేదంటే ఎండలో పెడితే.. ఉష్ణోగ్రతల కారణంగా ప్లాస్టిక్‌లో ఉన్న రసాయనాలు లోపల ఉన్న పాలను మరింత కలుషితం చేస్తాయని చెప్పారు. ప్లాస్టిక్ బాటిల్ వేడి అయిన సందర్భంలో.. రసాయనాలు వేగంగా కరిగి కలిసిపోతాయి. పాలైనా.. మరే పానియాల ద్వారా మైక్రోప్లాస్టిక్స్, ప్రమాదకరమైన రసాయనాలు పిల్లల శరీరంలోకి వెళ్లడం హానికరమన్నారు.
ఇదిలా ఉండగా.. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో 100 మంది శిశువులపై ఇటీవల నిర్వహించిన పరిశోధనలో.. ప్లాస్టిక్ బాటిల్స్‌తో పాలు తాగే పిల్లలు భవిష్యత్తులో ఐక్యూ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని గుర్తించారు. వైద్య కళాశాల పీడియాట్రిక్స్ విభాగం అధిపతి, పరిశోధనా బృందం గైడ్ డాక్టర్ ఓంశంకర్ చౌరాసియా మాట్లాడుతూ తల్లిపాలు ఇచ్చే వారితో పోలిస్తే సీసాలు, పాలు తాగే పిల్లలలో ఐక్యూ స్థాయి ఎనిమిది నుంచి పది పాయింట్లు తక్కువగా ఉందన్నారు. అలాంటి పిల్లల్లో ఊభకాయం వచ్చే ప్రమాదం సైతం ఉందని హెచ్చరించారు. భవిష్యత్‌లో అనేక రకాల వ్యాధులు పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు. పిల్లలలో కడుపులో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. పాల సీసాలను శుభ్రం చేయకపోవడం వల్ల పాల సీసాలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాంతో క్లీన్ చేయకుండా అలాగే పాలు తాగిస్తే పిల్లల కడుపులోకి వెళ్లి వ్యాధులు కలిగించే అవకాశం ఉంటుంది. దాంతో పిల్లలు ఈకొలి, సాల్మొనెల్లా, స్ట్రెప్ కోకస్ తదితర బ్యాక్టీరియాలో బారినపడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పిల్లలకు సీసాకు బదులుగా చెంచాతో పాలు తాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.